Amaravati, Sep 15: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలపై సమీక్ష (CM YS Jagan Review) చేపట్టారు. సమీక్ష సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిన్న రాష్ట్రంలో హెల్త్ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై సీఎం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు చేయబోయే హెల్త్ హబ్స్‌లో ఆరోగ్య శ్రీకి 50% కంటే ఎక్కువ బెడ్లను కేటాయించే ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. హెల్త్ హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం 50 శాతం బెడ్లను ఆరోగ్య శ్రీ రోగులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. హెల్త్ హబ్స్ ఏర్పాటు విధివిధానాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఏయే జిల్లాల్లో ఏ తరహా ప్రత్యేక వైద్య చికిత్సలు అవసరమో గణాంకాలు అందజేశారు. ఏ తరహా వైద్యం కోసం రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారనే వివరాలనూ అందజేశారు.
వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణ విధానాలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. హెల్త్ హబ్స్ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ప్రభుత్వం నుంచి ఒక సభ్యుడు ఉంటారని తెలిపారు. మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు కూడా ఇక్కడే స్థిరపడి, మంచి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశం హెల్త్ హబ్స్ ద్వారా నెరవేరుతుందని పేర్కొన్నారు.
డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రామాణికం కావాలని స్పష్టం చేశారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్ హబ్స్‌లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. లాభాపేక్ష లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న చార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న చార్జీలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు.