COVID Vaccination- AP CM YS Jagan | Photo: CMO

Guntur, April 1: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కోవిడ్ టీకా తీసుకున్నారు. ఆయనతో పాటు జగన్ సతీమణి భారతి కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ల పైబడిన పౌరులకు కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది, ఈ కోటాలో సీఎం జగన్ టీకా తొలి డోస్ అందుకున్నారు. గుంటూరు నగరంలోని భారత్ పేటా వార్డ్ సెక్రటేరియట్‌లో సీఎం జగన్‌కు కరోనా టీకాలు వేశారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో కోవిడ్19 వ్యాప్తి మరియు నివారణ చర్యలపై వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సీఎం జగన్ మాట్లాడుతూ రాబోయే 90 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనావైరస్ టీకా కార్యక్రమం పూర్తవుతుందని చెప్పారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం మనకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్ మాత్రమే అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలని ఆయన కోరారు.

ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉంది. రోజూవారీ పాజిటివ్ కేసులు భారీస్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,809 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 1271 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 9,03,260 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 9,00,365గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో  చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 285 కోవిడ్ కేసులు నమోదు కాగా, గుంటూరు నుంచి నుంచి కూడా అదే స్థాయిలో 279 కేసులు, విశాఖపట్నం నుంచి నుంచి 189, మరియు కృష్ణా జిల్లా నుంచి 161 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 3 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7,220కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 464 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,87,898 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 8,142 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.