Amaravati, Oct 13: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) మరో కీలక నిర్ణయ తీసుకున్నారు. కరోనా క్లిష్ట సమయంలోనూ ముందుండి వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. కరోనా వైరస్‌పై పోరులో మరణించిన ప్రతి జర్నలిస్ట్‌కు రూ.5 లక్షల పరిహారం (Rs 5 Lakh Compensation for Journalists) చెల్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (Indian Journalist Union) అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి మంగళవారం మీడియా ముందు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో కరోనా (Coronavirus) వల్ల అనేక మంది చనిపోతున్నారు. దీనిలో జర్నలిస్టులు కూడా మృత్యువాత పడ్డారు.వార్తా సేకరణ క్రమంలో అందరూ ముందుండి నడిచారు. ప్రధాని కూడా జర్నలిస్ట్ లు కరోనా వారియర్స్ అని చెప్పారు. జర్నలిస్టులను ప్రభుత్వాలు కూడా సహకారం ఇవ్వాలి. 50 లక్షలు బీమా ఇవ్వాలని కోరుతున్నాం. ఏపీలో 38 మంది జర్నలిస్టులు మృతి చెందారు. వారిని ఆదుకోవాలని ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. 38 మంది చనిపోయారని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు 5 లక్షలు ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు. చికిత్స తీసుకునే వారికి కూడా ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేశారు. సీఎంకు, దీనికి సహకరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్‌కు కృతజ్ఞతలు.’ తెలియజేశారు.
జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ..‘ కోవిడ్ వల్ల చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం జగన్ ముందుకు రావడం మంచి పరిణామం. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాము. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. యూనియన్లు కేంద్రం ప్రకటించిన 50 లక్షల బీమాను డిమాండ్ చేస్తున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల వెనుక ఉండి ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని నిరూపితమైంది. భవిష్యత్తులో కూడా సీఎం జగన్ జర్నలిస్టుల వెనుక ఉంటారనే నమ్మకం ఉందని అన్నారు.