HIGH COURT OF ANDHRA PRADESH| (Photo-Twitter)

Amaravati, Oct 13: ఏపీ సుందర నగరం విశాఖపట్నంలో నిర్మించ తలపెట్టిన అతిథి గృహానికి (Visakhapatnam guest house) రాజధానికి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అది స్వతంత్ర నిర్ణయమని, అతిథి గృహ నిర్మాణంపై గతంలో ఇచ్చిన యథాతథస్థితి (స్టేటస్‌ కో) ఉత్తర్వులను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ హైకోర్టును అభ్యర్థించారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వాన్ని పని చేసుకోనివ్వాలని, అతిథి గృహం స్వరూపం, విస్తీర్ణం, గదుల సంఖ్య, ప్లాన్‌ తదితర విషయాల్లో జోక్యం చేసుకునే పరిధి అధికరణ 226 కింద హైకోర్టుకు (AP High Court) లేదని ఏజీ నివేదించారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సూక్ష్మస్థాయిలో ప్రశ్నించే అధికారం, హక్కు పిటిషనర్లకు లేదని స్పష్టం చేశారు. పిటిషనర్లు ప్రభుత్వానికి ప్రవర్తనా నియమావళిని నిర్దేశించజాలరన్నారు. తిరుపతి, కాకినాడల్లో నిర్మిస్తున్న అతిథి గృహాలను విశాఖతో పోల్చి చూడడానికి వీల్లేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అతిథి గృహం నిర్మాణంపై దాఖలైన అనుబంధ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ అంశంపై ఉత్తర్వులను రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటిస్తూ విచారణను వాయిదా వేసింది.

కాగా పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై శాసన మండలిలో జరిగిన పరిణామాలకు సంబంధించిన వీడియో ఫుటేజీలను సీల్డ్‌ కవర్‌లో అందచేయాలని శాసనసభ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యాల్లో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది.

జడ్జీలపై అనుచిత పోస్టులు, కేసును సీబీఐకి అప్పగించిన ఏపీ హైకోర్టు, సీబీఐకి సహకరించాలని ఏపీ ప్రభుత్వానికి సూచన, రాజధాని అమరావతిపై విచారణ నవంబర్ 2కు వాయిదా

దసరా సెలవుల నేపథ్యంలో రాజధాని అంశంలో దాఖలైన వ్యాజ్యాలపై నవంబర్‌ 2 నుంచి హైబ్రీడ్‌ విధానంలో రోజువారీ విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. ఇరుపక్షాలకు ఏడు రోజుల సమయం మాత్రమే ఇస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాజధాని రైతులకు ప్రభుత్వం కౌలు చెల్లించినందున ఆ అనుబంధ పిటిషన్‌ను మూసివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఇప్పటికే స్టేటస్‌ కో ఉన్న అంశాలకు సంబంధించిన వ్యాజ్యాల్లో మళ్లీ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. అనంతరం అన్ని వ్యాజ్యాలపై విచారణను నవంబర్‌ 2కి వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చింది.

ఏపీ సీఎం వైయస్ జగన్ లేఖలో ఏముంది? న్యాయవ్యవస్థపై చర్చ మరోసారి తెరపైకి, ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న పలువురు ప్రముఖులు, సీజేఐ ఎస్‌ఎ బాబ్డే ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి

ఇక పలు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లలో పోలీసులపై అక్రమ నిర్భంద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీచేస్తామని హైకోర్టు ప్రాథమిక అభిప్రాయం వ్యక్తంచేసింది. ఈ కేసులను సీబీఐతో దర్యాప్తునకు ఎందుకు ఆదేశించకూడదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో రాజ్యాంగ అమలు వైఫల్యం (కాన్‌స్టిట్యూషనల్‌ బ్రేక్‌డౌన్‌) ఉందా లేదా అన్న అంశంపై వాదనలు వినిపించాలని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

న్యాయవ్యవస్థతో ఏపీ ప్రభుత్వం ఢీ, ఏపీ హైకోర్టు జడ్జీల తీర్పుల తీరుపై సీజేఐకి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్, మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం

ఏపీ పోలీసులపై (AP Police) దాఖలైన పలు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై జస్టిస్‌ రాకేశ్‌ నేతృత్వంలోని ధర్మాసనం గత కొద్దిరోజులుగా విచారణ జరుపుతోంది. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం తన విచారణను కొనసాగించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక సీనియర్‌ కౌన్సిల్‌ సర్వా సత్యనారాయణప్రసాద్‌ పోలీసుల తరఫున వాదనలు వినిపించారు.

దంపతుల అక్రమ నిర్భందంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాదిపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని సత్యనారాయణప్రసాద్‌ అన్నారు. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని కూడా ఒత్తిడి చేయలేదన్నారు. న్యాయవాది ఇంట్లో తనిఖీలకు ఈ కేసుకు సంబంధంలేదని ఆయన తెలిపారు. పిటిషనర్లవి కేవలం ఆరోపణలే తప్ప, వాస్తవాలు కావన్నారు. సివిల్‌ జడ్జి ఇచ్చిన నివేదికలో అనేక లోపాలున్నాయని, ఆ నివేదిక సమగ్రంగా లేదని సత్యనారాయణ ప్రసాద్‌ చెప్పారు.

ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. సివిల్‌ జడ్జి నివేదికలో ఉన్న వాస్తవాలని పిటిషనర్లు చెబుతున్నారని, అయితే.. ఆ నివేదికను పోలీసులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తామని తెలిపింది. ఎందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించకూడదో వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు, తదుపరి విచారణ నవంబర్‌ 2కి వాయిదా

ఈ సమయంలో సత్యనారాయణ ప్రసాద్‌ జోక్యం చేసుకుంటూ.. ప్రతీ చిన్న కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిన అవసరంలేదన్నారు. ఎలాంటి సందర్భాల్లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా నిర్దేశించిందని తెలిపారు. అసలు ఈ వ్యాజ్యాల్లో పోలీసు ఉన్నతాధికారులపై ఎలాంటి ఆరోపణలులేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకొచ్చారు.

ఇలాంటి కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన దాఖలాలు లేవన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఇదే రీతిలో గతంలో ఓ న్యాయవాది విషయంలో కూడా పోలీసులు వ్యవహరించారని, తరువాత ఆ న్యాయవాది తన కేసును ఉపసంహరించుకున్నారని తెలిపింది. ఆ కేసును ఇప్పటికే మూసేసినప్పటికీ, దానిపై మళ్లీ విచారణ జరుపుతామని స్పష్టంచేసింది. ఆ కేసును కూడా ప్రస్తుత కేసుల జాబితాలో ఉంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.