Vijayawada, OCT 27: తెలంగాణ నుంచి ఇటీవల ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు వచ్చిన ఐఏఎస్ అధికారులకు (AP Cadre IAS) ఆ రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి కాటాను (Amrapali Kata) ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వీసీఎండీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా కూడా ఆమ్రపాలికి పూర్తి అదనపు బాధ్యతలను ఏపీ ప్రభుత్వం అప్పగించింది. పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్ అయిన జి.వాణిమోహన్‌ను (Vani Mohan) బదిలీ చేసి జీఏడీలో సర్వీసుల వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఆ శాఖలో ఉన్న పోల భాస్కర్‌ను రిలీవ్ చేసింది. కుటుంబ సంక్షేమశాఖ, ఆరోగ్య కమిషనర్‌గా వాకాటి కరుణ కూడా నియమితులయ్యారు.
జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా వాకాటి కరుణకు అదనపు బాధ్యతలను అప్పగించింది. కార్మికశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణీ ప్రసాద్‌ను నియమించగా, కార్మికశాఖ అదనపు బాధ్యతల నుంచి ఎం.ఎం.నాయక్‌ను రిలీవ్ చేసింది. తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్‌కు మాత్రం ఏపీ ప్రభుత్వం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.
ఐఏఎస్ ఆధికారుల బదిలీల వ్యవహారం ఇటీవలే హాట్ టాపిక్‌గా మారింది. ఐఏఎస్ అధికారులను సొంత రాష్ట్రాలకు వెళ్లాల్సిందిగా ఈనెల 9న డీవోపీటీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ నెల 16లోగా సొంత రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సిందిగా 2 తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ఐఏఎస్ ఆధికారులను డీవోపీటీ ఆదేశించింది. ఈ క్రమంలోనే డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారులంతా క్యాట్‌ను ఆశ్రయించారు. ప్రస్తుత రాష్ట్రాల్లోనే కొనసాగేలా ఆదేశాలివ్వాలంటూ క్యాట్‌లో పిటిషన్ వేశారు. క్యాట్‌లో కూడా డీవోపీటీ ఆదేశాలనే పాటించాల్సిందిగా తీర్పు వచ్చింది.