ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో, పలువురు ఉద్యోగులు బదిలీ కానున్నారు. ఉద్యోగుల బదిలీలపై (employee transfers) నిషేధాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి 31 వరకు బదిలీలకు అవకాశం ఇస్తూ ఆర్థికశాఖ (Finance Department) ఆదేశాలు ఇచ్చింది.ప్రస్తుతం ఉన్న చోట రెండేళ్లకు పైబడి పనిచేసిన ఉద్యోగులు బదిలీ అయ్యే ఛాన్స్ ఉంది.
ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఏప్రిల్ 30 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారికి బదిలీ తప్పనిసరి అని, ఏప్రిల్ 30 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తైన వారికి బదిలీకి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గిరిజన ప్రాంతాల్లో భర్తీ చేశాక ఇతర ప్రాంతాలపై దృష్టి సారిస్తామని ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖలు, ఎక్సైజ్, రవాణా, వ్యవసాయ శాఖలూ బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ సర్కారు ఆదేశాలు ఇచ్చింది.
పాఠశాల, ఇంటర్, ఉన్నతవిద్య శాఖలకు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ACB కేసులు, విజిలెన్స్ విచారణ ఉన్నవారి వివరాలు చెప్పాలని ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 1 నుంచి ఉద్యోగుల బదిలీలపై మళ్లీ నిషేధం వర్తిస్తుందని ఆర్థికశాఖ పేర్కొంది.