Tirumala, June 16: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని (Tirumala) దర్శించుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో రద్దీ (Crowd) ఎక్కువ. కొన్నిసార్లు స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుంది. పండుగలు, సెలవు దినాల్లో రద్దీ మరింతగా పెరిగిపోతుంది. అన్ని గంటల పాటు క్యూలైన్లలో ఉండాలంటే ప్రతీ ఒక్కరికీ అవస్థనే. ముఖ్యంగా వృద్ధుల ఇబ్బందులు చెప్పనలవికాదు. తిరుమల శ్రీవారి దర్శనానికి వృద్ధులకు ప్రత్యేక దర్శన సౌకర్యం ఉన్నప్పటికీ, ఇబ్బందులు తప్పట్లేదు. దీంతో ఏపీ సర్కారు సీనియర్ సిటిజన్లకు టీటీడీ తరుఫున శుభవార్త అందించింది. వేంకటేశ్వరుని ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్‌లకు రెండు టైమ్ స్లాట్లు ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు ఈ స్లాట్లను ఏర్పాటు చేశారు. దీంతో 30 నిమిషాల్లోనే వృద్ధులు శ్రీవారిని దర్శించుకోవచ్చు.
వాహనదారులకు బిగ్ షాక్, భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఏకంగా ఎంత పెంచారంటే?
ప్రత్యేక క్యూలైన్.. అల్పాహారం కూడా
ఈ ప్రత్యేక దర్శనం విధానంలో వృద్ధులు ఎక్కువ దూరం నుంచి క్యూలైన్లలో రావాల్సిన అవసరం లేకుండా... వంతెన కింద గ్యాలరీ నుంచి, ఎలాంటి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండానే దైవ దర్శనాన్ని కల్పించనున్నారు. దీనికోసం ముందుగా వృద్ధులు తమ ఫొటో ఐడెండిటీ (ఆధార్ లేక ఇతర డాక్యుమెంట్లు)తో వయస్సు రుజువును చూపించాలి. సంబంధిత పత్రాలను ఎస్-1 కౌంటర్‌లో సమర్పించాలి. పరిశీలించిన అధికారులు వృద్ధులను ప్రత్యేక క్యూలైన్లలోకి పంపిస్తారు. అలాగే, వృద్ధుల కోసం క్యూలైన్లలో సీటింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక, క్యూలైన్లలో వృద్ధులకు వేడి సాంబార్ అన్నం, పెరుగు అన్నం, వేడి పాలు అందిస్తారు. క్యూలైన్లలో వృద్ధులకు ప్రతిదీ ఉచితమే.
లడ్డూలు కూడా..
వృద్ధులకు ప్రత్యేకంగా అందిస్తున్న ఈ సదుపాయంలో భాగంగా తక్కువ ధరకే రెండు లడ్డూలు అందిస్తారు. రూ.20 చెల్లించి ఈ రెండు లడ్డూలు పొందవచ్చు. అదనపు లడ్డూలు కావాలంటే, ప్రతి లడ్డూకు రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఇక, ఆలయం ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి, కౌంటర్ వరకూ వృద్ధులను డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులో ఉంటుంది.
మిగతా క్యూలైన్లు బంద్
వృద్ధుల కోసం తీసుకొచ్చిన ఈ ప్రత్యేక దర్శనం సమయంలో మిగతా అన్ని ఇతర క్యూలు నిలిపివేస్తారు. కేవలం వృద్ధుల క్యూలైన్లనే అనుమతిస్తారు. అలా ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్ లు స్వామివారి 30 నిమిషాల్లోనే దర్శనం చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం టీటీడీ ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబరు 08772277777 అందుబాటులోకి తీసుకువచ్చింది.