Protest Against AP Job Calendar: జాబ్‌ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ ముందు నిరుద్యోగులు నిరసన, వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని, పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్
AP YS Jagan- Job Calendar | Photo: FB

Amaravati, June 21: ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ముందు నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు (Protest Against AP Job Calendar) నిర్వహించారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని, పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం కోట క్రాస్ రోడ్స్ వద్ద విద్యార్థి సంఘాల నేతలు మానవ హారం కట్టారు. తర్వాత కలెక్టరేట్ కు భారీ ర్యాలీ తీశారు. జాబ్ క్యాలెండర్ తో (job calendar for the year 2021-22) ఏమాత్రం లాభం లేదన్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కర్నూల్ కలెక్టరేట్ వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ బాగోలేదంటూ గుంటూరులో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

విజయనగరంలో యువత ఆందోళన బాట పట్టింది. విద్యార్థి సంఘాలు ఈ ఉదయం కలెక్టరేట్‌ను ముట్టడించాయి. తొలుత విద్యార్థులు కోట కూడలి వద్ద మానవహారం చేపట్టారు. ఇక్కడి నుంచి కలెక్టరేట్‌ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్‌లో తక్కువ సంఖ్యలో ఉద్యోగాలకు అవకాశం కల్పించారని విద్యార్థులు విమర్శించారు. ఇది నిరుద్యోగులకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖాల్లోని ఖాళీలతో నోటిఫికేషన్‌ ఇవ్వాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 'జాబ్ క్యాలెండర్' విడుదల చేసిన సీఎం జగన్, ఈ ఆర్థిక సంవత్సరంలో 10,143 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు వెల్లడి

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌‌పై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతీయ గ్రంధాలయం వద్ద నిరుద్యోగ జేఏసి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే మెగా డీఎస్సీ, పోలీసు నోటిఫీకేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసి రాష్ట్ర కన్వినర్ కొక్కలిగడ్డ సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.