YS Sharmila (PIC@ ANI X)

Vijayawada, FEB 22: నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే నిర్బంధిస్తారా? అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా?అని నిలదీశారు. గురువారం ‘చలో సెక్రటేరియట్‌’కు రాష్ట్ర కాంగ్రెస్‌ (Congress) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లోనే షర్మిల (YS sharmila) నిద్రించారు. గురువారం ఉదయం అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలుచోట్ల కాంగ్రెస్‌ నేతలను గృహ నిర్బంధం, ముందస్తు అరెస్టులు చేశారు. దీనిపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు.

 

‘‘వేలాదిగా వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు? పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పార్టీ కార్యాలయంలో గడపాలా?నాకు ఈ పరిస్థితి రావడం మీకు అవమానం కాదా?మేం తీవ్రవాదులమా? సంఘ విద్రోహ శక్తులమా?మమ్మల్ని ఆపాలని చూస్తున్నారంటే మీరు భయపడుతున్నట్లే. మీ అసమర్థతను కప్పిపుచ్చాలని చూస్తున్నారు. ఎన్ని ఆటంకాలు కలిగించినా నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆగదు’’ అని పేర్కొన్నారు.