APPSC Logo(Photo-File Image)

Vijayawada, FEB 22: గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) స్పష్టత ఇచ్చింది. పరీక్షను వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది. ఆదివారం.. గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ సమాధానమిచ్చింది. ‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పరీక్షలు వాయిదా వేయలేం. అభ్యర్థుల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది. గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో ఎక్కడా రోస్టర్‌ పాయింట్ల ప్రస్తావన లేదు. వాయిదా డిమాండ్‌ వెనుక కోచింగ్‌ సెంటర్ల పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. నోటఫికేషన్‌ రద్దు చేయించడం కోసం దుష్ర్పచారం చేయించారు’’ ఏపీపీఎస్సీ తెలిపింది.

YS Jagan: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్.. 24న ఉదయం వైసీపీ ప్రజాప్రతినిధులతో సమావేశం, వాడివేడిగా సాగనున్న సభలు  

షెడ్యూల్‌ ప్రకారం.. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుగుతుందని ఏపీపీఎస్సీ అధికారులు ధ్రువీకరించారు. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా..92,250 మంది మెయిన్స్‌ పరీక్షకు హాజరు కానున్నారు.

రోస్టర్‌ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకుంది. 23న నిర్వహించాల్సిన పరీక్షను కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్‌ అంశం కోర్టులో ఉంది. వచ్చే నెల 11న మరో మారు విచారణ జరగనుంది. కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్‌ వేసేందుకు ఇంకా సమయం ఉందని, అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కానీ, ఏపీపీఎస్సీ మాత్రం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే పరీక్ష నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చింది.