Amaravati, June 16: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 పరీక్షల్లో తదనంతర చర్యలన్నింటినీ నాలుగు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. గురువారం నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు కూడా నిలిపివేయాలని ఆదేశించింది. గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టును (Andhra Pradesh High Court) ఆశ్రయించారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్ విధానంలో వాల్యుయేషన్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి ఇంటర్వ్యూలు (APPSC Group-I Services Interview 2021) జరగాల్సి ఉండగా హైకోర్టు తీర్పుతో వాయిదా పడింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ పబ్లిక్ కమిషన్‌ను ఆదేశించింది.నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. కొద్దిసేపటి హైకోర్టు క్రితం తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్‌లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలిచ్చింది.
కాగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం పరీక్షలు జరగలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డిజిటల్ వాల్యూయేషన్ గురించి చివరి దశలో చెప్పారన్నారు.
అయితే నిబంధనల ప్రకారమే గ్రూప్-1 పరీక్షలు జరిగాయని, వాల్యూయేషన్ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున వ్యాయవాది వాదనలు హైకోర్టుకు తెలిపారు. ఇక ఇరు వాదనలు విన్న హైకోర్టు మంగళవారం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. గ్రూప్-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.