Bus fires hiked in APSRTC | Photo: Twitter

Amaravathi, December 11: ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సుల్లో ప్రయాణించేవారు టికెట్ ధరకు గతంలో కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. బస్సు ఛార్జీలను పెంచుతూ (Charges Hike) ఏపీఎస్ ఆర్టీసీ మంగళవారమే ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సు సర్వీసులలో కిలోమీటరుకు 10 పైసలు చొప్పున అధికంగా ఛార్జీలు వసూలు చేయనున్నారు. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జి రూ. 5గానే ఉంచారు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రం కనీస టికెట్ ఛార్జీ రూ. 10గా నిర్ణయించారు.

ఇక ఎక్స్‌ప్రెస్, డీలక్స్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచారు. దీంతో దూర ప్రయాణాలు సామాన్య ప్రయాణికులకు భారం కానున్నాయి. కనీస ఛార్జీలు ఈ బస్సుల్లో వరుసగా రూ. 15, రూ. 20 మరియు రూ.25 గా నిర్ణయించారు.

అలాగే ఏసీ బస్సుల్లో అక్యుపెన్సీ తక్కువగా ఉండటం, ప్రైవేట్ బస్సు టికెట్ ధరలు తక్కువగా ఉండటం చేత పోటీని తట్టుకునేందుకు వీటిల్లో కిలోమీటరుకు 10 పైసలు చొప్పున పెంచారు. దీని ప్రకారం సూపర్ లగ్జరీ ఏసీ, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్, అమరావతి సర్వీసుల్లో కి.మీకు 10 పైసలు చొప్పున అధిక ఛార్జీలు వసూలు చేయబడతాయి. వీటిల్లో కనీస బస్సు ఛార్జీ రూ. 35 గా నిర్ణయించారు.

కాగా, నైట్ రైడర్, వెన్నెల బస్సుల్లో ఛార్జీలు పెంచలేదు. వీటిల్లో కనీస ఛార్జీ ఎప్పట్లాగే రూ. 70గా ఉండనుంది.

నష్టాలను ఎదుర్కొంటున్న ఆర్టీసీని కాపాడటానికి బస్సు ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీ రూ .6735 కోట్ల నష్టాల్లో ఉంది, అలాగే డీజిల్ ధరల పెరుగుదల వలన రూ. 650 అదనపు భారం మరియు కార్మికుల జీతాల పెంపుతో మొత్తంగా ఏడాదికి రూ.1280 కోట్ల భారం పెరిగిందని అంతకుముందు రవాణామంత్రి పేర్ని నాని (Perni Nani) మీడియాకు వివరించారు.