ఏపీలో బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటింగ్ నిర్వహించారు. అటు తెలంగాణలో హుజూరాబాద్ లో సాయంత్రం 5 గంటల సమయానికి 76.26 శాతం పోలింగ్ నమోదైంది. బద్వేలులో అదే సమయానికి 59.58 శాతం ఓటింగ్ జరిగింది. ఇదిలా ఉంటే బద్వేలులో 2019లో 77 శాతం పోలింగ్ నమోదు కాగా.. ప్రస్తుతం ఈ ఉప ఎన్నికలో గతం కంటే పదిశాతం వరకు తగ్గిందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. కాగా ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబరు 2న చేపట్టనున్నారు. చెదురు మదురు ఘటనలు, స్వల్ప ఘర్షణలు మినహా తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలోనే జరిగాయి. బద్వేలు ఉప ఎన్నికల్లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు వెల్లడించారు. బద్వేలు ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు.
బద్వేలు నియోజకవర్గంలో దొంగ ఓట్లు వేస్తున్నారని, ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని తరలిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల్లో నిజంలేదని ఏపీ సీఈవో విజయానంద్ స్పష్టం చేశారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోందని, మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా నిశితంగా పరిశీలించినట్లు వెల్లడించారు.