Kurnool, October 09: కర్నూలు జిల్లా దేవరగట్టు (Devaragattu village)లో మల్లేశ్వరస్వామి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రా, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలమంది భక్తులు వేడుకలు చూసేందుకు తరలివచ్చారు. అయితే ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే సాంప్రదాయ కర్రల సమరం ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా రక్తమోడింది. మల్లేశ్వరస్వామి విగ్రహాలను దక్కించుకునేందుకు చుట్టుపక్కల ఉండే 11 గ్రామాల ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో తలపడ్డారు. ఈ కొట్లాటలో దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు, వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు వెంటనే అప్రమత్తమై క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
'బన్ని ఉత్సవం' (Banni Festival) గా ప్రాచుర్యం పొందిన ఈ కర్రల సమరం చాలా ప్రాముఖ్యత గలది. ఇందులో భాగంగా, దేవరగట్టులోని 11 గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం దసరా రోజున యుద్ధభూమిలోకి ప్రవేశిస్తారు. ఈ కార్యక్రమానికి వెళ్లేటప్పుడు తమ వెంట కర్రలను తీసుకెళ్తారు. కర్రల సమరం చేసి స్వామివారి విగ్రహాలను దక్కించుకోవడం ఇక్కడి ఆచారం. అలా స్వామివారి విగ్రహాలను దక్కించుకోవడం తమ ఊరి పరువుగా గ్రామస్తులు భావిస్తారు. ఈ తంతు జరిగేది భక్తి కోసమే అయినా, ఇందులో పాల్గొనే భక్తుల ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. ప్రతీఏటా ఎంతో మంది తలలు పగిలి చనిపోతున్నారు, తీవ్రంగా గాయపడుతున్నారు. ఈ కార్యక్రమానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు మాత్రం ప్రతీ ఏడాది ఈ ఆచారాన్ని కొనసాగించడం, ప్రాణాల మీదకు తెచ్చుకోవడం పరిపాటిగా మారింది.
నిన్నటి కర్రల సమరం దృశ్యాలు
#WATCH Andhra Pradesh: People from five villages participated in age old Banni festival in Devaragattu village, Holagunda mandal of Kurnool district yesterday.They formed 2 groups to fight with wooden sticks as part of a traditional competition to claim the idol of a local deity pic.twitter.com/pdwL0xDc1i
— ANI (@ANI) October 9, 2019
ఈ ఏడాది కూడా పోలీసులు, అధికారులు ఈ కర్రల సమరాన్ని ఆపేందుకు గత పదిరోజులుగా విశ్వ ప్రయత్నాలు చేసినా, ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ ఉత్సవంలో పాల్గొన్న వారిలో అధిక శాతం మద్యం సేవించి వచ్చారు. ఆ మద్యం మత్తులో ఇష్టమొచ్చినట్లు కర్రలతో కొట్టుకోవడంతో ఎక్కువ మంది గాయాలపాలయ్యారు.
తాజా- అక్టోబర్ 10 వరకు, దాదాపు ఈ కర్రల సమరంలో గాయపడిన వారి సంఖ్య 100కు చేరినట్లు సమాచారం అందింది, అలాగే 20 మంది ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు తెలిసింది.