CM YS Jagan (Photo-Twitter/AP CMO)

Eluru, April 14: ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై (AP Fire Accident) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు (Rs 25L ex gratia to kin of Eluru victims), తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయవల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందాలని ముఖ్యమంత్రి (CM YS Jagan Mohan Reddy) అధికారులను ఆదేశించారు.

ఏలూరులో ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడం పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి విదితమే.యూనిట్‌-4లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు బీహార్‌కు చెందిన వారున్నారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో గాయపడిన వారందరినీ ఏడు 108 అంబులెన్స్‌లలో నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారిని విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఈ ఘటనపై విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. విజయవాడ ఆస్పత్రిలో 12 మందిని చేర్చారు. మార్గమాధ్యలో ఒకరు మృతి చెందారు. 12 మందికి చికిత్స అందిస్తున్నాం. ఒకరిద్దరు తప్ప అందరి పరిస్థితి విషమంగా ఉంది. 70 శాతంపైగా గాయాలయ్యాయి. బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నామని భాగ్యలక్ష్మి అన్నారు. విషాద ఘటనపై సూపర్‌వైజర్‌ రాజు స్పందిస్తూ.. ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా భారీ శబ్ధం వచ్చింది. చూసేసరికి ఫ్యాక్టరీ మొత్తం మంటలు అలుముకున్నాయి. కింది విభాగంలో పనిచేస్తున్న అందరం బయటకు పరుగులు తీశాం. పైవిభాగంలో పనిచేస్తున్న కొంతమంది మంటల్లో సజీవదహనమయ్యారు. ప్యాక్టరీలో ఎప్పుడూ ఇలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు.