Amaravathi, April 8: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) తాజాగా మరో 15 కరోనావైరస్ పాజిటివ్ (COVID-19) కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 329కు చేరింది. ఈరోజు ఉదయం వరకు కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరు నుంచి 6, కృష్ణా జిల్లా నుంచి 6 మరియు చిత్తూరు జిల్లా నుంచి 3 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఇక ఏపీ నుంచి కరోనావైరస్ బారినపడిన వారిలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, ఆరుగురు కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా కేసులు కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచే నమోదవుతున్నాయి. జిల్లాల వారీగా బుధవారం ఉదయం వరకు వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే కర్నూలు జిల్లా 79 కేసులతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా, నెల్లూరు జిల్లాలో తాజాగా 6 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ కేసులు 49కి పెరిగాయి.
కృష్ణా 35, గుంటూరు 41, కడప 28, ప్రకాశం 24, పశ్చిమ గోదావరి 21, విశాఖపట్నం 10, తూర్పు గోదావరి 11, చిత్తూరు 20, అనంతపురం 6గా ఉన్నాయి.
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో కరోనావైరస్ వైరస్ ప్రభావం ఎంతమాత్రం లేదు, ఈ రెండు జిల్లాలలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
దేశవ్యాప్తంగా 5,194కు పెరిగిన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య, తెలంగాణ నుంచి 404 బాధితులు
దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కడప, వైజాగ్ మరియు గుంటూరులో కొత్తగా ల్యాబోరేటరీలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.
మరోవైపు విశాఖపట్నంలోని మెడ్ టెక్ జోన్ (Med Tech Zone) కరోనావైరస్ నిర్ధారణ కిట్లను (Testing Kits) అతి త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. సుమారు 500 టెస్టింగ్ కిట్ లను సీఎం జగన్ చేతుల మీదుగా లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ కిట్ల ద్వారా కేవలం 55 నిమిషాల్లోనే కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించవచ్చునని సంస్థ చెబుతోంది.