అమరావతి: రెండ్రోజులుగా ఏపీ ప్రజల గుండెల్లో గుబులు రేపిన అసని తుఫాను ఎట్టకేలకు తీరం దాటింది. అసని తుఫాను కృష్ణా జిల్లా కృత్తివెన్ను సమీపంలో తీరాన్ని దాటింది. ఇక్కడ భూభాగాన్ని తాకిన అనంతరం బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఈశాన్య దిశగా కదులుతున్నట్లు తెలిపారు. మచిలీపట్నానికి 20 కిలోమీటర్లు, నరసాపురానికి 40 కిలోమీటర్ల మధ్య అసని తుఫాను.. తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి తీరం దాటినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు.
తుఫాను తీరందాటిందని అజాగ్రత్తగా ఉండకూడదని తెలిపారు. గురువారం రాత్రికి ఉత్తర ఈశాన్య దిశగా యానాం, కాకినాడ, తుని తీరాల వెంబడి కదులుతూ.. వాయుగుండంగా మారి మళ్లీ బంగాళాఖాతంలోకి ప్రవేశించవచ్చని వాతావరణ శాఖ అధికారుల అంచనా వేస్తున్నారు.
Severe Cyclonic Storm Asani is about 450 km southeast of Visakhapatnam (Andhra Pradesh) at 1130 IST of 9th May. It is very likely to move northwestwards till 10th May. Thereafter recurve N-NEwards. It is likely to weaken gradually into a Cyclonic Storm during next 24 hours. pic.twitter.com/6Jamqf5VI2
— India Meteorological Department (@Indiametdept) May 9, 2022
తుఫాను ప్రభావంతో.. రెండ్రోజులుగా రాష్ట్రంలో కురిసిన వర్షాలు, ఈదురుగాలుల ధాటికి మామిడి, అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిని.. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్క కృష్ణాజిల్లాలోనే 900 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో అత్యధికంగా 15.5 సెంటీమీటర్లు, తిరుపతి జిల్లా ఓజిలిలో 13.6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.
కాకినాడ జిల్లా ఉప్పాడ-కొత్తపల్లి రహదారి భారీ అలలకు ధ్వంసమైంది. తుఫాను కారణంగా రాష్ట్రంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అసని తుఫాను తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతున్నప్పటికీ.. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేడు, రేపు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపారు.