Cyclone Asani Alert To AP: బంగాళాఖాతంలో అల్పపీడనం, Andhra Pradeshకు దూసుకొస్తున్న తుపాను, Cyclone Asaniతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..
Cyclone (Photo credits: IMD)

Cyclone Asani: ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు ముంచుకొస్తుంది. బంగాళాఖాతం తూర్పుతీరంలో ఏర్పడిన ఆసాని తుఫాను ఏపీ వైపు దూసుకొస్తుంది. ఈనెల 10 నాటికి తుఫాను రాష్ట్రంలో ప్రవేశిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటి సమయంలో భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్యంగా పయనించి వాయుగుండంగా బలపడుతుంది.

ఆ తరువాత వాయువ్యంగా పయనించి రేపు సాయంత్రం తూర్పుమధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి తుఫాన్‌గా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఆసాని తుఫాను తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుఫాను ధాటికి రేపటి నుంచి ఏపీ, బెంగాల్‌, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. తుఫాను నేపథ్యంలో అండమాన్ సహా.. ఒడిశా, బెంగాల్, సిక్కిం, అస్సాం, ఏపీ, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

తుఫాన్‌ హెచ్చరికతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర, మధ్య ప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. తుఫాన్‌ ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు ఏపీలోని విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. దాంతో విపత్తు నిర్వహణశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆసాని తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.