Cyclone Michaung Latest News: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి శనివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇది మరింత బలపడి 3వ తేదీ మధ్యాహ్నం కి నైరుతి బంగాళాఖాతానికి చేరుకొని తుపానుగా (Cyclone Michaung ) మారనుంది. ఇది డిసెంబరు 4 వరకు పశ్చిమ వాయవ్య దిశగా, ఆపై దాదాపు ఉత్తర దిశగా కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా పయనించి నెల్లూరు, మచిలీపట్నం (Nellore and Machilipatnam) మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
డిసెంబరు 3 నుంచి 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుపాను వేళ అత్యవసర సాయం, సమాచారం కోసం ఈ స్టేట్ కంట్రోల్ రూం ప్రారంభించారు. స్టేట్ కంట్రోల్ రూం ద్వారా సాయం, సమాచారం పొందగోరే వారు 1070, 112, 18004250101 నెంబర్లలో సంప్రదించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితిని పర్యవేక్షిస్తుంటామని, జిల్లాల అధికార యంత్రాగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామని తెలిపింది. తుపాను నేపథ్యంలో... రైతులు, కూలీలు, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మరోవైపు.. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని దక్షిణ శ్రీలంకపై సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటరలఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. తుపాను ప్రభావం కోస్తా తీరం వెంబడి ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వెల్లడించారు.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, రైతులకు అందుబాటులో ఉండాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ ఆదేశించారు. ఖరీఫ్ వరి పంట కోతలు ముమ్మరంగా జరుగుతున్నందున.. కోతలు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. కోతల్లో, కొనుగోళ్ల సమయంలో ఒక్క రైతు కూడా నష్టపోకూడదని చెప్పారు.