Earthquake in Visakhapatnam: ఏపీలోని విశాఖపట్టణంలో భూమి కంపించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావటంతో నగర వాసులు ఆందోళనకు గురయ్యారు. అక్కయ్యపాలెం, మధురానగర్, బీచ్‌రోడ్డు, తాటిచెట్లపాలెం, అల్లిపురం, ఆసిల్‌మెట్ట, సీతమ్మధార, గురుద్వారా, రైల్వేస్టేషన్, బీచ్ రోడ్డు, హెచ్‌బీకాలనీ, జ్ఞానాపురం, బంగారమ్మమెట్ట, సింహాచలం, అడవివరం, గోపాలపట్నం ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం. విశాఖ ఓల్డ్ టౌన్‌తో పాటు, ఫిషింగ్ హార్బర్ పరిసర ప్రాంతాల్లోనూ భారీ శబ్దంతో ఉదయం 7.15 గంటల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు.
భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందోనని కాసేపు టెన్షన్‌కు గురయ్యారు. శాంతిపురం ఎన్జీవోస్ కాలనీలో పాత భవనాల శ్లాబ్ పెచ్చులు ఊడి పడ్డాయి. భూ ప్రకంపనలపై కారణాలను భూగర్భ శాస్త్రవేత్తలు వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇందుకు గల కారణాలను వారు విశ్లేషిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించారు. సాధారణ భూప్రకంపనలే అని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. రిక్టర్ స్కేల్ పై 1.8 గా నమోదైనట్లు వెల్లడించారు.
పెద్ద శబ్దాలు రావటంతో పాటుగా కొంత మంది నివాసాల్లోని సామాన్లు సైతం కదిలినట్లుగా చెబుతున్నారు. కాళ్ల కింద నుంచి వైబ్రేషన్స్ వెళ్లినట్లుగా స్థానికులు వివరించారు. కొంత మంది తమ ఇంటి గోడల్లో కదలికలు.. పక్షులు ఒక్క సారిగా ఎగిరిపోవటం చూసామాంటూ స్థానికులు వివరిస్తున్నారు. విశాఖ భూ ప్రకంపణలకు అవకాశం లేని ప్రాంతంగా గుర్తించారని..అయితే, ఇటువంటి పరిస్థితి ఏర్పడటం పైన కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది.