చిత్తూరు, మార్చి 20: చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన ఓ బాలుడి హత్యా కేసు మిస్టరీని పోలీసులు చేదించారు. తొలుత బాలుడు చెట్టు కొమ్మకు ఉరేసుకున్నట్లుగా కనిపించడంతో ఆత్మహత్యగా భావించారు. కానీ, పోలీసులు విచారణ చేపట్టగా అది హత్యగా తేలింది. ఆ హత్యకు దారి తీసిన పరిస్థితులను స్థానిక పోలీసులు వెల్లడించారు. 10 రోజుల క్రితం జరిగిన ఈ హత్య కేసు వివరాలను మదనపల్లి డీఎస్పీ మీడియాకు వెల్లడించారు.
చిత్తూరు జిల్లా కలిగిరి మండలంలోని అద్దవారిపల్లికి చెందిన కె.రవి, తులసి దంపతుల కుమారుడు ఎనిమిదేళ్ల ఉదయ్ కిరణ్. ఈ నెల 11న శుక్రవారం నుంచి కనిపించకపోవడంతో 12వ తేదీన తల్లి కలికిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అదే రోజు సాయంత్రం బాలుడు అద్దవారిపల్లి సమీపంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు.
11న సాయంత్రం బాలుడు ఉదయ్ కిరణ్ తనకు స్వయానా బాబాయి అయిన కె.సహదేవ, వారి సమీప బంధువు అయిన రాజేశ్వరితో ఏకాంతంగా ఉండడాన్ని గమనించాడు. తమ వివాహేతర సంబంధం గురించి పిల్లాడు బయటకు చెప్తాడనే భయంతో ఇద్దరూ కలిసి ఉదయ్ కిరణ్ మర్మాంగాలపై కొట్టారు. ఆ తర్వాత టవల్‌తో గొంతు బిగించి చంపేశారు. ఉరేసుకుని చనిపోయినట్లుగా నమ్మించడానికి అర్ధరాత్రి శవాన్ని గ్రామ సమీపంలోని వేప చెట్టుకు తువ్వాలుతో వేలాడదీశారు.
ఫిర్యాదు అందగానే హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కోసం సీఐ నాగార్జున రెడ్డి రంగంలోకి దిగారు. ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. కేసులో చాలా అనుమానాలు ఉండడంతో పక్కా సాక్ష్యాధారాలను సేకరించడానికి పోలీసులు చాలా మదన పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు నిందితులను గుర్తించి శనివారం అరెస్టు చేసి రిమాండుకు పంపారు. సీఐ నాగార్జున రెడ్డి, కలకడ, కేవీ పల్లె వాల్మీకిపురం ఎస్‌ఐలు రవిప్రకాష్ రెడ్డి, కేవీ పల్లి ఎస్సై బాలకృష్ణ, వాయల్పాడు ఎస్సై బిందుమాధవి, ఏఎస్ఐ మధుసూదనా చారిలతోపాటు పోలీసు సిబ్బందిని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ రవి మనోహరాచారి వివరించారు.