Chennai, September 20: చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ తుదిశ్వాస విడిచారు.. కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ దానికి చికిత్స పొందుతున్నారు. అయితే, ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ శివప్రసాద్ చనిపోయారు. శివప్రసాద్ మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. తన చిరకాల మంత్రుడు చనిపోవడం విచారకరమన్నారు.
నటన నుంచి రాజకీయం వైపు మళ్లిన శివప్రసాద్ రాజకీయాలాలో తనదైన శైలిని ప్రదర్శించేవారు. జై చిరంజీవ, పిల్లా జమీందార్, అటాడిస్తా, టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించిన శివప్రసాద్ , తాను ఎంపీగా ఉన్నప్పుడు కూడా తన నటనానుభవాన్ని నిరసనలకు ఉపయోగించుకునేవారు. రాష్ట్రంలో ఏవైనా సమస్యలున్నప్పుడు అందుకు తగినట్లుగా వేషధారణ చేసుకొని లోకసభ వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతూ మొత్తం మీడియానీ తన వైపు ఆకర్శించేవారు. ఆ విధంగా సమస్య యొక్క తీవ్రతకు విస్తృత ప్రచారం కల్పించేవారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో నిరసన వ్యక్తం చేసినందుకు సస్పెండ్ అయిన ఎంపీలలో ఆయన ఒకరు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ గా దుస్తులు ధరించి నిరసన తెలియజేయడం ద్వారా ప్రత్యేక హోదా పట్ల ఆంధ్రుల కాంక్షను ఢిల్లీ స్థాయిలో చాటిచెప్పగలిగారు.
విచిత్ర వేషధారణలతో చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్
కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినపుడు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కొద్ది రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. నాలుగు రోజుల క్రితమే కీలక నేత కోడెల శివ ప్రసాద్ రావును కోల్పోయిన టీడీపీ ఈరోజు నారిమల్ల శివ ప్రసాద్ ను కూడా కోల్పోవడంతో ఆ పార్టీలో మరింత విషాదాన్ని నింపింది.
శివప్రసాద్ ఎన్నో సినిమాల్లో చిన్నా చితక వేషాలతో అలరించాడు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘మాస్టారి కాపురం’ సినిమా శివప్రసాద్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. అటు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘డేంజర్’ సినిమాలో ఆయన విలన్‌గా అభిమానులను మెప్పించారు. ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు. ఇక నితిన్ హీరోగా వచ్చిన ఆటాడిస్తా సినిమాలో నన్ను కొట్లే అనే డైలాగ్‌తో బాగా ఫేమస్ అయ్యాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా తెలుగులో ‘ఇల్లాలు’, రోజా హీరోయిన్‌గా పరిచయమైన ‘ప్రేమ తపస్సు’, ఆ తర్వాత ‘టోపీరాజా స్వీటి రోజా’ ‘కొక్కోరకో’ వంటి పలు సినిమాలను కూడా డైరెక్ట్ చేసాడు.