Chittoor, May 29: చిత్తూరులో ప్రియురాలిని కలవడానికి వెళ్లిన ఓ యువకుడు ఆమె తండ్రి చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. రాత్రి వేళ తన ఇంట్లో కూతురితో కలిసి ఉన్న యువకుడిని చూసిన తండ్రి ఆగ్రహంతో రగిలిపోయి అతన్ని కర్రతో కొట్టి (Father killed his daughter's boyfriend) చంపేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో (Chittoor Palamaner) చోటుచేసుకుంది. డీఎస్పీ గంగయ్య ఘటన వివరాలను శుక్రవారం మీడియాకు వివరించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పలమనేరు మండలం పెంగరగుంట కు చెందిన ఈశ్వరగౌడ్ కుమారుడు ధనశేఖర్ (23) బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఈ నెల 22న స్వగ్రామానికి వచ్చాడు. అదేరోజు రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీనిపై అతని తండ్రి ఈనెల 26న స్థానిక పోలీసులకు పిర్యాదు చేయగా వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుని ఫోన్ కాల్స్ ఆధారంగా ఆఖరి కాల్‌ను ట్రేస్ చేసి పెంగరగుంటకు చెందిన బాబును విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.
బాబు కుమార్తె (16), ధనశేఖర్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బాలిక 22వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తన తండ్రి మొబైల్ నుంచి ఫోన్ చేయడంతో అతను బాలిక ఇంటికి వెళ్లాడు. పొలం వద్దకు వెళ్లిన బాబు రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చి వసారాలో పడుకున్నాడు. అయితే ఇంట్లోని ఓ గది నుంచి మాటలు వినిపించడంతో వెళ్లి చూడగా తన కుమార్తెతో పాటు ధనశేఖర్ కనిపించాడు. ఆగ్రహించిన బాబు ధనశేఖర్‌ను కర్రతో కొట్టి చంపేశాడు.
అనంతరం గోతాంలో మూటకట్టి చిన్నకుంట సమీపంలోని ఓ బావిలో పడేసి ఇంటికొచ్చేశాడు. రెండు రోజుల తరువాత బావివద్దకు వెళ్లి చూడగా శవం తేలి కనిపించింది. హత్య విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు కొందరి సాయంతో మృతదేహాన్ని మల్బరీ ఆకులు కత్తిరించే కట్టర్ సాయంతో ముక్కలు ముక్కలుగా చేసి సమీపంలోని అటవీప్రాంతంలో పూడ్చిపెట్టాడు. పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని వెలికితీశారు.
పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పలమనేరు సీఐ జయరామయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ నాగరాజు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ధనశేఖర్‌ను హత్య చేసిన బాబుతో పాటు ఆయనకు సహకరించిన అందర్నీ అరెస్టు చేస్తామని డీఎస్పీ గంగయ్య స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి బాబుతో పాటు ఆయన భార్య, కుమార్తెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది