Amaravati, May 29: చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం (Punganur) అప్పిగానిపల్లెలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని గ్రామస్థులు రాళ్లతో, కట్టెలతో కొట్టి చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పిగానిపల్లెకు చెందిన ఓ వృద్ధురాలు (old woman) సమీపంలోని వనమలదిన్నె గ్రామానికి వెళ్లి బ్యాంకులో నగదు డ్రా చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరింది. అయితే ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన గురుమూర్తి(47) అనే వ్యక్తి ఆమెను అనుసరిస్తూ వచ్చాడు.
వెనుక నుంచి అనుసరిస్తూ వచ్చి ఎవరూ లేని సమయంలో వనమలదిన్నె సమీపంలోని సబ్‌స్టేషన్ వెనుక పొదల్లోకి లాక్కెళ్లాడు.. నోరు మూసిపెట్టి దారుణంగా ఆ వృద్ధురాలిపై అత్యాచారానికి తెగబడ్డాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగదు, బంగారు కమ్మలు, చైను, ముక్కు పుడక లాక్కెళ్లాడు. ఈ దారుణ ఘటనతో బాధితురాలు స్పృహ కోల్పోయింది. ఆపై కొన్ని గంటల తర్వాత మేల్కొని తీవ్ర గాయాలతో గ్రామంలోకి వెళ్లి గ్రామస్థులకు విషయం చెప్పింది.
అనంతరం స్థానికులు ఆమెను పుంగనూరు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలించారు. అయితే గ్రామ సమీపంలో తచ్చాడుతున్న నిందితుడు గురుమూర్తిని పట్టుకున్న గ్రామస్థులు (Villagers attack) ఆవేశం ఆపుకోలేక చెట్టుకు కట్టేసి చావబాదారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రగాయాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. డీఎస్పీ గంగయ్య, సీఐ గంగిరెడ్డి, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే వనమలదిన్నెకు చెందిన గురుమూర్తి గతంలోనూ మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు అతనిపై గతంలో కూడా పుంగనూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. గురుమూర్తి ఒంటరి మహిళలపై దాడి చేయడం, ఆపై అత్యాచారం చేయడం అలవాటు చేసుకున్నాడు. ఈ హింసను భరించలేక కొన్నేళ్ల క్రితం అతని భార్య, పిల్లలు వదిలి వెళ్లిపోయారు.