Narasaraopet, May 26: నరసారావు పేట గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ కృష్ణయ్య (Two Town CI Krishnaiah) తెలిపారు. మార్చి 14న జరిగిన ఈ దారుణ ఘటనలో (Narasaraopet Gang Rape Case) నిందితులు పరారీలో ఉండగా..మంగళవారం పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. ఈ ఘటన వివరాల్లోకెళితే.. నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన ఓ యువతి భర్తతో విభేదాల కారణంగా నరసరావుపేట పట్టణంలో ఒంటరిగా నివసిస్తోంది. తన దగ్గర ఉన్న 47 సవర్ల బంగారాన్ని భద్రపరచమని సుమారు ఏడాది కిందట బరంపేటకు చెందిన ఆవుల మస్తాన్‌రావు, కనపర్రు గ్రామానికి చెందిన గుంజి శ్రీనివాసరావులకు ఇచ్చింది.
అయితే బంగారం తిరిగి ఇవ్వకపోవటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారాన్ని సెటిల్‌మెంట్ చేసి బంగారం తిరిగి ఇప్పిస్తానని మాజీ రౌడీషీటర్ గుజ్జర్లపూడి ఆనంద్ విజయ్‌కుమార్ అలియాస్ కన్నల్ పోలీస్ స్టేషన్‌లో ఆరు నెలల కిందట ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాసనగర్‌లో ఓ గృహం అద్దెకు తీసుకొని యువతిని అక్కడ ఉంచాడు. ఈ ఏడాది మార్చి 14వ తేదీన కన్నల్, అతని స్నేహితుడు వినుకొండ నియోజకవర్గ ఓ పార్టీ ఇన్‌చార్జి అట్లూరి విజయకుమార్ కలిసి గృహంలో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
విషయం ఎక్కడైనా చెబితే తమ దగ్గర ఉన్న నగ్నవీడియోలు నెట్‌లో పెడతామని ఆమెను బెదిరించారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిపై టూటౌన్ పోలీసులు అదే రోజు గ్యాంగ్‌రేప్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నిందితులిద్దరు పరారై ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. మంగళవారం కేసులో రెండవ నిందితుడైన అట్లూరి విజయకుమార్‌ను అరెస్ట్ చేశారు.