Fire Accident: రేణిగుంటలో అగ్నిప్రమాదం.. వైద్యుడి సజీవదహనం.. మరో ఇద్దరి చిన్నారుల పరిస్థితి..
Fire (Image Credits: Google)

Renigunta, September 25: తిరుపతి జిల్లా రేణిగుంట (Renigunta)లోని ఓ ఆస్పత్రిలో (Hospital) అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో.. అక్కడే ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. ఈ దుర్ఘటనలో వైద్యుడు రవిశంకర్‌రెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. అతడి కుమారుడు, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. రేణిగుంట పట్టణం భగత్‌సింగ్‌ కాలనీలో డాక్టర్‌ రవిశంకర్‌రెడ్డి కార్తికేయ పేరుతో ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబం ఆస్పత్రి నిర్వహిస్తున్న భవనంలోనే పైఅంతస్తులో నివాసముంటోంది. ఆదివారం ఉదయం వైద్యుడి కుటుంబం నివాసముంటున్న అంతస్తులో మంటలు చెలరేగాయి.

విద్యార్థిని యూనిఫాం మాసిపోయిందని ఉతికిన ఉపాధ్యాయుడు.. సస్పెండ్ చేసిన అధికారులు.. ఎందుకంటే?

స్థానికులు గమనించి వెంటనే రవిశంకర్‌రెడ్డి భార్య, అత్తతో పాటు ఆయన కుమారుడు భరత్‌ (12) కుమార్తె కార్తీక (15)లను బయటకు తీసుకొచ్చారు. ఘటనాస్థలంలోనే డాక్టర్‌ రవిశంకర్‌రెడ్డి సజీవ దహనమైనట్లు తెలిసింది. ఇద్దరు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమాచారం అందుకున్న తిరుపతి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆస్పత్రిలో రోగులెవరూ లేకపోవడతో పెను ప్రమాదం తప్పింది.