AP Finance Minister Buggana On Fiscal Council: ఏపీ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది టీడీపీ హయాంలోనే, ఫిస్కల్‌ కౌన్సిల్‌ అవసరం లేదని కేంద్రమే చెప్పింది, రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన ధ్వజం
Buggana Rajendranath Reddy (File Image)

విజయవాడ, జనవరి 30 : బడ్జెట్‌ అమలు కోసం ద్రవ్య మండలి (Fiscal Council) ఏర్పాటు చేయాలన్న విపక్షాల డిమాండ్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తోసిపుచ్చారు. కాగ్, ఆర్థిక సంఘం, గణాంకాల సంస్థలు ఉండగా కౌన్సిల్‌ అవసరం లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌదరి పార్లమెం ట్‌లో ప్రకటించడాన్ని గుర్తుచేశారు. కరోనా ఏడాదైన 2020–21ని పదేపదే సాధారణ సంవత్సరాలతో పోలుస్తూ విమర్శలకు దిగటాన్ని తప్పుబట్టారు. కోవిడ్‌ మహమ్మారితో 2020–21లో ప్రపంచంతోపాటు దేశంలోనూ ఆర్థిక స్థూల ఉత్పత్తి భారీ గా పతనమైందన్నారు. ఇదే క్రమంలో మన రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా బాగా దెబ్బతిందన్నారు. 2020– 21లో రాష్ట్ర ఆదాయం సుమారు రూ.8,000 కోట్లు తగ్గిపోగా మరోపక్క కోవిడ్‌ నియంత్రణ, చికిత్సల కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.7,120 కోట్లు వ్యయం చేసిందన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారమే బడ్జెట్‌ను అమలు చేస్తున్నామన్నారు. అవాస్తవాలు ప్రచారం చేయటాన్ని ఖండిస్తూ బుగ్గన మీడియాకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలివీ..

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యయాలపై టీడీపీ విమర్శలు అర్ధరహితం. 2020 – 21 తొలి ఆర్నెళ్లలో మూల ధన వ్యయం తక్కువగా చేశారనే విమర్శలు తప్పు. ఇవి గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయి. టీడీపీ హయాంలో మూల ధన వ్యయం ఎంత చేశారో చెప్పాలి. పేదలకు గోరంత ఇచ్చి కొండంత ప్రచారం చేసుకున్న చరిత్ర టీడీపీదే. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు సంక్షేమం కోసం నగదు బదిలీతో రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేసింది. దేశంలో సంక్షేమానికి ఇంత భారీగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మరెక్కడా లేదు. పేదలకు సంక్షేమ పథకాల వల్ల ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆరోపణల్లో వాస్తవం లేదు.

విద్య, వైద్య రంగాలు నిర్వీర్యం

టీడీపీ దృష్టిలో ఆర్థికాభివృద్ధి అంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు, ప్రైవేట్‌ సంస్థలతో ఎంవోయూలకు పరిమితం కావడమే. వాటితో లేనిది ఉన్నట్లు చూపించి మార్కెటింగ్‌ చేసుకున్నారు. విద్య, వైద్య రంగాలను నీరుగార్చి వాగ్దానాలను మరిచి మోసగించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దృష్టిలో ఆర్థికాభివృద్ధి అంటే.. రైతన్నల సంక్షేమం, మూలధన నిర్మాణం, విద్య, వైద్య రంగాల్ని మెరుగుపరచడం, మహిళా సాధికారత, వికేంద్రీకరణ, పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పన. పేదలు మంచి చదువులు చదివి అన్నిరంగాల్లో ముందుండటం టీడీపీకి ఇష్టం లేదు. ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన వినూత్న కార్యక్రమాలను కేంద్రంతో సహా ఇతర రాష్ట్రాలు మెచ్చుకుని అక్కడ కూడా అమలు చేస్తుంటే టీడీపీ నేతలకు దిక్కుతోచడం లేదు. గత సర్కారు హయాంలో దివాలా తీసిన రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాం.