Amaravati, May11: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు (Narayana) కోర్టులో ఊరట లభించింది. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో అరెస్టయిన ఆయనకు బెయిల్ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ చిత్తూరు పట్టణ నాలుగో మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. పోలీసుల అభియోగాన్ని తోసిపుచ్చిన మేజిస్ట్రేట్ పోలీసుల రిమాండ్‌కు నిరాకరించారు. ఏపీలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో (SSC Paper Leak Case) చిత్తూరు జిల్లా పోలీసులు నిన్న మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అనంతరం మంగళవారం రాత్రి ఆయనను చిత్తూరు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
కాగా నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి నారాయణ 2014లోనే రాజీనామా చేసినట్టు ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు ఆధారాలు చూపించారు. ఆ వాదనలతో అంగీకరించిన కోర్టు బెయిలు మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు.
బెయిలు లభించిన అనంతరం నారాయణ మాట్లాడుతూ.. నారాయణ విద్యాసంస్థల అధినేతగా తాను 2014లోనే తప్పుకున్నా, ఇంకా దాని అధినేతగానే ఉన్నానని పోలీసులు తనపై తప్పుడు అభియోగం మోపారని అన్నారు. దానితో తనకు ఎలాంటి సంబంధమూ లేదని కోర్టుకు ఆధారాలు సమర్పించామని, దీంతో తనపై మోపిన నేరారోపణ నమ్మేలా లేదన్న అభిప్రాయానికి వచ్చిన న్యాయమూర్తి బెయిలు మంజూరు చేసినట్టు చెప్పారు.