గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్య పరీక్షల కోసం వచ్చిన యువతి ప్రైవేటు భాగాలను ఫోటోలు తీస్తూ ఆసుపత్రిలో పనిచేసే యువకుడు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే ఈసీజీ గదిలో ఒక యువతికి పరీక్షలు చేస్తూ, సెల్ఫోన్లో ఫొటోలు తీసిన వ్యక్తిని కొత్తపేట పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కొత్తపేట పీఎస్ ఎస్ఐ ఖాజీబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పాత గుంటూరుకు చెందిన ఒక యువతి అనారోగ్య కారణాలతో ఈసీజీ తీయించుకునేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఈసీజీ విభాగంలో పనిచేస్తున్న రాకేష్ వ్యక్తిగత సెలవులో ఉండటంతో అతడి స్థానంలో నల్లచెరువుకు చెందిన బత్తుల హరీష్‌ను ఉంచాడు.
ఆస్పత్రిలో హరీష్ ఈసీజీ పరీక్షలు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం పాత గుంటూరుకు చెందిన యువతికి పరీక్షలు చేస్తున్న సమయంలో ఆమె దుస్తులు తొలగించి ఉండగా, ఆమెను హరీష్ సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశాడు. దీన్ని గుర్తించిన యువతి కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఆమె తల్లి, ఇతర రోగులు, అవుట్‌పోస్ట్ పోలీసులు వచ్చి హరీష్ ను పట్టుకున్నారు. పోలీసులు అదుపులో తీసుకొని రిమాండ్ లోకి తీసుకొని, కోర్టులో హాజరు పరిచారు.