Tirumala, May 03: తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గాలివానతో కూడిన భారీ వర్షం (Heavy Rain) కురిసింది. దీంతో వాతారణం చల్లబడింది. మాడు పగిలేలా ఉన్న మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం వర్షం కురవడంతో రిలీఫ్ పొందారు. చల్లని వాతావరణంలో భక్తులు సేదతీరారు. వరుసగా రెండో రోజు తిరుమలలో భారీ వర్షం (Rain In Tirumala) కురిసింది. గంటకు పైగా వాన పడింది. కుండపోత వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షంతో ఎండ వేడిమి నుంచి భక్తులు ఉపశమనం పొందారు. వాన రాకతో తిరుమలగిరులు చల్లబడుతున్నాయి. కాగా, గాలి వానకు కౌస్తుభం అతిథి గృహం వద్ద వృక్షం విరిగిపడింది. ఆ సమయంలో చెట్టు కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి విశ్వరూపంతో నిప్పులకొలిమిలా మారాయి. మాడు పగిలే ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా సాధారణం కంటే అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండిపోతున్న ఎండల ధాటికి జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఎండలకు తోడు వడగాలులు వీస్తుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
అధిక ఉష్ణోగ్రతలకు తోడు పొడి వాతావరణం, దక్షిణ నైరుతి దిశల నుంచి గాలుల ప్రభావం వల్ల వడగాలుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఎండాకాలం ఎప్పుడెప్పుడు అయిపోతుందా.. మళ్లీ వానలు పడి వాతావరణం ఎప్పుడు చల్లబడుతుందా అని జనం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుమలలో కురిసిన వర్షం భక్తులను కాస్త ఊరట పొందేలా చేసింది.