భగభగ మండే ఎండలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు మరో వారం రోజుల పాటు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో మొత్తం 18 జిల్లాలో ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం మొదలై సాయంత్రం వరకు కొనసాగుతోంది. 8 జిల్లాల్లో 46 నుంచి 46.6 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పులతో బెంబేలెత్తుతున్న తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్, వర్షాలపై కీలక సమాచారమిచ్చిన ఐఎండీ
నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.6 డిగ్రీలు రికార్డయింది. సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, నాగర్‌కర్నూల్, కరీంనగర్ జిల్లాల్లో 46 డిగ్రీలపైన నమోదయ్యాయి. నిర్మల్, గద్వాల, సిరిసిల్ల, యాదాద్రి, ఆసిఫాబాద్, ములుగు, నారాయణపేట, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో 45.1 నుంచి 45.8 డిగ్రీల వరకు ఎండ కాసింది.నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు ఎండల ధాటికి చిగురుటాకులా వణికిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా పాత రికార్డులను బద్దలు కొడుతున్న వేడి గాలులు, మరో వారం రోజుల పాటు హీట్ వేవ్ తప్పదంటున్న ఐఎండీ, రాష్ట్రాలవారీగా ఉష్ణోగ్రతల వివరాలు ఇవిగో..
ఏపీ విషయానికి వస్తే.. గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1, మార్కాపురంలో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో 46.7, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 46.6 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. 33 మండలాల్లో తీవ్ర వడగాలులు, 188 మండలాల్లో వడగాలులు వీచాయి. ఈ నెల ఆరవ తేదీ వరకు ఈ ఎండల ప్రభావం ఉంటుందని ఆ తర్వాత చల్లబడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.