విజయవాడ, జనవరి 14: సంక్రాంతి పండుగ రానే వచ్చింది. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగను పల్లెల్లో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేవి పల్లె వాతావరణం, పాడి పంటలు, భోగిమంటలు, కోడిపందాలు, ముగ్గుల పోటీలు. ఈ పండుగకి ఎగసిపడే భోగిమంటలు రంగురంగుల ముగ్గులు పచ్చని పైరుగల పొలాలు అన్నీ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. మన తెలుగు సంప్రదాయం ప్రకారంగా చూసుకుంటే సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించినప్పుడు అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనం సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. ఈ పండుగ సమయంలో రైతులు పండించిన పంట చేతికి వచ్చి వారికి లాభం చేకూరుస్తుంది కాబట్టి దీనిని రైతుల పండుగ అని కూడా అంటారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే పట్టణాలకు వలస వచ్చిన వారంతా తమ స్వగ్రామాలకు చేరుకొని పండుగను జరుపుకుంటారు మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ తమిళనాడులో ఈ పండుగని కన్నులవిందుగా జరుపుకుంటారు. ఈ పండుగ జరుపుకునే మూడు రోజులలో మొదటి రోజు భోగి అని రెండవ రోజు మకర సంక్రాంతి అని మూడవ రోజు కనుమగా పిలుస్తారు.
మొదటి రోజు భోగి: భోగి రోజు అందరూ ఉదయాన్నే లేచి చలిమంటలు వేసి ఆ మంటల్లో పాత వస్తువులు వేస్తూ తమ లోని చెడు ఆలోచనలను తరిమికొట్టే దిశగా వాటిని అగ్నికి ఆహుతి చేస్తారు. తమలోని పాత చెడు జ్ఞాపకాలు అన్ని ఆ అగ్నిలో కలిసిపోయాయని భోగి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు.భోగి రోజు ఉదయాన్నే ముగ్గులు పెట్టి రేగుపండ్లతో తలంటు స్నానాలు చేయడం ఈరోజటి విశిష్టత. ప్రతి సంవత్సరం జనవరి 14 వ తేదీన భోగి పండుగను జరుపుకుంటారు.
రెండవ రోజు మకర సంక్రాంతి: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ రోజున మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఇక ఈ రోజు ఆడవారు పొద్దున్నే లేచి కల్లాపి చల్లి ఇరుగుపొరుగు వారితో పోటాపోటీగా రంగు రంగుల ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గుల్లో గోబ్బెమ్మలు పూలు రేగుపండ్లు కుంకుమ పసుపు పెట్టి అలంకరిస్తారు. ముఖ్యంగా ఈ రోజున గంగిరెద్దుల వారి సన్నాయిలు, హరిదాసుల వారి సంకీర్తనలు, పంబాలవారు ఇంటింటికి తిరగటాలాంటివి కనిపిస్తుంటాయి. సంక్రాంతి రోజున పిల్లలు ఎగరవేసే గాలిపటాలు ఆకాశంలో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి పండుగని జనవరి 15వ తేదీన జరుపుకుంటారు.
మూడవ రోజు కనుమ: ఈ పండుగలో చివరి రోజు కనుమ, కనుమ రోజు వాకిల్లలో రంగురంగుల రథాలను వేస్తారు. ముఖ్యంగా పల్లెల్లో ఈరోజు కోడిపందాలు, ఎద్దుల పోటీలు జరుపుతారు. ప్రతి సంవత్సరం ఈ పండుగని జనవరి 16వ తేదీన జరుపుకుంటారు.