Pawan Kalyan: గెలుపు కోసం, వ్యక్తిగత లబ్ది కోసం పాకులాడే వ్యక్తిని కాదు, జనసేన ఓడిపోలేదు, సీఎం జగన్‌కు కేసులంటే భయం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో వైకాపా విఫలమవుతోందన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్
Janasena Party Chief Pawan Kalyan | File Photo.

Amaravathi, October 23:  అమరావతి రాష్ట్ర కార్యాలయంలో జనసేన కార్యకర్తలను ఉద్దేశించి అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడారు. నీతి, నిజాయితీ ఉండేవారు రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆకాంక్షిచారు. గెలుపుకోసమో, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో పాకులాడే వ్యక్తిని కాదని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ఎన్నికల్లో జనసేన (Janasena Party) ఓడిపోలేదు, 7 శాతం గెలిచిందని పవన్ చెప్పారు. జాతీయ పార్టీగా ఉన్న టీడీపీ కంటే జనసేన పార్టీ మెరుగైన ప్రదర్శన చేసిందని తెలిపారు.  వైసీపికి 151 సీట్లు అనేవి కాలమో, ఈవీఎంల ఘనతో తెలియదు. 

నమ్మని 10 లక్షల మంది తనకు అవసరం లేదని, తనని నమ్మే 10 మంది ఉన్నా చాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈరోజు సాధించిది తక్కువే కావచ్చు,కానీ సుదీర్ఘ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని అన్నారు. అన్ని విషయాలు గమనించే రాజకీయాల్లోకి వచ్చానన్న జనసేన అధినేత, తన అంతిమశ్వాస వరకు జనసేన పార్టీని నడుపుతానని స్పష్టం చేశారు. తనతో పాటు 25 ఏళ్ల పాటు ప్రయాణించేవారు కావాలని పిలుపునిచ్చారు. మానవత్వం కోసం పరితపించే ప్రతీ ఒక్కరిని తాను అభిమానిస్తానని పేర్కొన్నారు. 20 సంవత్సరాల తర్వాత జనసేన గురించి దేశమంతటా చర్చించుకుంటారు. అలాంటి కలలు కంటున్నానని పవన్ అన్నారు.

తేదేపా, వైకాపా పాలనలో ఎలాంటి మార్పు లేదు

 

గతంలో టీడీపీ నాయకులు ఎలా వ్యవహరించారో ఇప్పుడు వైసీపీ నాయకులు అలాగే వ్యవహరిస్తున్నారు. ఇసుక మాఫియా ఇప్పుడు కూడా జరుగుతుంది, రాష్ట్రంలో నేరాలు చాలా జరుగుతున్నాయి, హింస కొనసాగుతుంది. ప్రభుత్వాన్ని నడిపేవారు హింసను ప్రోత్సహించకూడదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి, కోడి కత్తి కేసులు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రాజెక్టులపై ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్, రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రంతో బలంగా మాట్లాడలేకపోయారు. ఆయనకు సీబీఐ కేసుల భయం ఉంది. తమపై కేసులుండేవారే కేంద్రంతో రాజీ పడతారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ప్రజలు 151 సీట్లతో గెలిపించినా, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో వైకాపా విఫలమవుతుందని పవన్ కళ్యాణ్ విమర్శించారు.