AP's COVID19 Report: ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఏడాది, రాష్ట్రంలో మళ్లీ కోరలు చాస్తున్న కోవిడ్, ఇటీవల కాలంలో తొలిసారిగా 200 దాటిన పాజిటివ్ కేసులు
Coronavirus in AP | (Photo Credits: PTI)

Amaravati, March 12: ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా కేసు నమోదై నేటికి సరిగ్గా ఏడాదవుతోంది. గతేడాది 2020, మార్చి 12న ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా ఉందని తేలడంతో రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదయింది. ఆ తర్వాత వారానికే మరొకటి, అలా వైరస్ ఒకరి నుంచి ఒకరికి  వేగంగా వ్యాప్తి చెందింది. ఆగష్టు- సెప్టెంబర్ నెలలో ఏపీలో భయంకరంగా ఒక్కోరోజు 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. దేశంలోనే మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కేసులు పెరిగి రెండో స్థానానికి చేరుకుంది. ఇలాంటి సమయంలో రాష్ట్రప్రభుత్వం కఠిన లాక్డౌన్ అమలు చేసింది, కరోనా టెస్టులు, చికిత్స, ఇతర నియంత్రణ చర్యల కోసం రూ. 1100 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఈ విధంగా ఏపి ప్రభుత్వం వైరస్ ను అదుపు చేయడంలో భారీ విజయం సాధించింది.

అయితే గత కొంతకాలంగా ఏపిలో తగ్గుతూ వచ్చిన కేసులు ఇప్పుడు నెమ్మదిగా పెరుగుతూ పోతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 44,709 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 210 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 8,91,388 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,88,493గా ఉంది.

ఒక్క చిత్తూరు జిల్లాలోనే గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా 85 కోవిడ్19 కేసులు నమోదు కాగా,  తూర్పు గోదావరి జిల్లా నుంచి ఆశ్చర్యకరంగా 41 కొత్త కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

గడిచిన ఒక్కరోజులో కృష్ణా జిల్లాలో కోవిడ్ కారణంగా ఒకరు మరణించారు. దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7180కు పెరిగింది.

నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 140 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,82,981మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1227 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.