RGV

Vijayawada, OCT 27: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల (Ap assembly elections) ముందు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే వ్యూహం అనే కొత్త మూవీని తియ్యబోతున్నట్లు ప్రకటించారు. ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయిన తర్వాతి రోజే రాంగోపాల్ వర్మ (Ramgopal varma) ఈ ప్రకటన చేయడం గమనార్హం.  'నేను అతి త్వరలో “వ్యూహం” (Vuyham) అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను. ఇది బయోపిక్ కాదు. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్‌లో అయినా అబద్దాలు ఉండొచ్చు. కానీ రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయి.' అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఆ తర్వాత వరుస ట్వీట్లతో (RGV Tweets) సంచలనం సృష్టించారు.  వెంటనే 'అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కథ.. రాజకీయ కుట్రల విషంతో నిండి వుంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం.' అని మరో ట్వీట్ చేశారు.

అయితే.. ఆ “వ్యూహం” ఎవరికి లాభం చేస్తుంది.. ఎవరికి నష్టం చేస్తుందనే చర్చ జరుగుతోంది. ఆర్జీవీ “వ్యూహం”పై ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది.. మొదటి పార్ట్ “వ్యూహం”, 2nd పార్ట్ “శపథం”.. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునేలోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్, పార్ట్ 2 “శపథం “లో తగులుతుంది. అని మూడో ట్వీట్ చేశారు ఆర్జీవీ. వ్యూహం “చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్. ఎలక్షన్స్ టార్గెట్‌గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక.. ఏం చెప్పాలో.. ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు. అని మరో ట్వీట్ చేశారు.

అయితే  ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్స్‌పై పొలిటికల్ సర్కిల్స్ ‌లో చర్చ స్టార్ట్ అయ్యింది. జగన్‌తో మీటింగ్ జరిగిన తర్వాత రోజే.. డైరెక్టర్ ఆర్జీవీ ఈ ట్వీట్ చేశారు. దీంతో రాజకీయ నేపథ్యంలో వర్మ తీయబోయే ఓ సినిమా గురించి జగన్‌తో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామలపై అక్కడ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాంగోపాల్ వర్మకు ఏపీ రాజకీయాలకు విడదీలేని సంబంధం ఉంది. ఆయన విజయవాడలో చదువుకోవడం.. ఏపీ పాలిటిక్స్‌పై ప్రభావం చూపేలా సినిమాలు తీయడంతో ఆయన ఏపీ పాలిటిక్స్‌లో భాగమయ్యారు.

గతంలో ఆయన రెండు కీలక సినిమాలు తీశారు. అవి రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాలు ఆంధ్రాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ సినిమాలు ఎన్నికలపైనా ప్రభావం చూపాయని ఓ పార్టీకి చెందిన నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. గతంలో వచ్చిన సినిమాల సంగతి ఎలా ఉన్నా.. 2024 ఎన్నికలకు ముందు వర్మ మరో మూవీ బాంబ్ పేల్చేందుకు రెడీ అయ్యారు. దీనిపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.