Pawan Kalyan (Photo-Video Grab)

Narsapuram, April 22: టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప‌లికిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) వ్యాఖ్య‌ల ప‌ట్ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) మండిప‌డ్డారు. చిరంజీవి అజాత శ‌త్రువు అని, ఆయ‌న జోలికొస్తే స‌హించేది లేద‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని హెచ్చ‌రించారు. ఆదివారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర్సాపురంలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. స‌జ్జ‌ల‌కు డ‌బ్బు, అధికారం ఎక్కువైంద‌ని మండిప‌డ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింహం కాదు.. గుంట‌న‌క్క‌లు, తోడేళ్ల బ్యాచ్ అని ఆరోపించారు.

 

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినా, మ‌ళ్లీ నిల‌బ‌డ్డానంటే ప్ర‌జ‌ల అభిమాన‌మేన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. ద‌శాబ్దం పాటు ఒడిదొడుకుల‌ను ఎదుర్కొని జ‌న సేన ఎదిగింద‌ని అన్నారు. జ‌గ‌న్ (YS Jagan) మాదిరిగా త‌న‌పై 32 కేసుల్లేవ‌న్నారు. రాష్ట్రాభివృద్ధి కోస‌మే మూడు పార్టీలు క‌లిశాయ‌న్నారు. ప్ర‌జ‌ల వ‌ల‌స‌లు, ప‌స్తుల్లేని రాష్ట్ర నిర్మాణ‌మే ఎన్డీఏ కూట‌మి ల‌క్ష్యం, ప్ర‌జ‌ల బంగారు భ‌విష్య‌త్ కోస‌మే త‌మ మూడు పార్టీలు నిల‌బ‌డ్డాయ‌ని పేర్కొన్నారు.

కేంద్రం స‌హ‌కారంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. త‌మ కూట‌మి అధికారంలోకి రాగానే అభివృద్ధితోపాటు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని, యువ‌త‌లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్ష‌ణ ఇస్తామ‌ని తెలిపారు. త‌క్కువ గ‌డువులోపు పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయ‌డంతోపాటు చేతివృత్తుల‌ను, కుల వృత్తుల‌ను కాపాడ‌తామ‌న్నారు.