Srisailam, March 31: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం (Srisailam)మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో కొందరు కన్నడిగులు (Kannada devotees) బీభత్సం సృష్టించారు. గత అర్ధరాత్రి శ్రీశైలంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చాయ్ దుకాణం దగ్గర జరిగిన గొడవతో ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. ఉగాది ఉత్సవాల్లో భాగంగా మల్లన్నను దర్శించుకోవడానికి కర్ణాటక భక్తులు (Kannada devotees) శ్రీశైలానికి భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ కన్నడ భక్తుడు చాయ్ తాగేందుకు వెళ్లాడు. దుకాణ యజమానిని తాగడానికి నీళ్లు అడిగాడు. అయితే లేవని చెప్పడంతో ఆ భక్తుడు అతనితో గొడవకు దిగాడు. అది కాస్తా తీవ్రం కావడంతో టీ షాపు యజమాని కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడిచేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.
ఇదంతా గమనిస్తున్న తోటి భక్తులు ఆలయ పరిసరాల్లోని షాపులను ధ్వంసం చేశారు. షాపుల్లో వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. కనిపించిన వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో చాలావరకు టూవీలర్స్, ఫోర్ వీలర్స్ అగ్నికి ఆహుతయ్యాయి.
గొడవను ఆపేందుకు సెక్యూరిటీ సిబ్బంది గానీ, పోలీసులు యత్నించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే కాసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు..శ్రీశైలం వీధుల్లో పెద్దసంఖ్యలో మోహరించారు. గొడవను అదుపులోకి తీసుకొచ్చారు. దుకాణాలపై దాడులతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, గాయపడిన వ్యక్తిని పరామర్శించారు జగద్గురు పీఠాధిపతి. గొడవకు దిగిన కన్నడ భక్తులు... అటుగా వచ్చే భక్తులపై కూడా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరికి గాయాలవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.