Vjy, Dec 1: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న కృష్ణా జలాల వివాదం కేసు (Krishna Water Dispute Case) విచారణను జనవరి 12వ తేదీ వరకు సుప్రీంకోర్టు ( Supreme Court ) వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరికొంత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ న్యాయవాది సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ వివాదంపై కేసు (Krishna Water Dispute) విచారణను జనవరి 12కు కోర్టు వాయిదా వేసింది.
కృష్ణ ట్రిబ్యునల్‌కు నూతన విధివిధానాలు ఇవ్వడాన్నిఏపీ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో (Supreme Court) పిటీషన్ వేసింది. ఈ విచారణను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేయనున్నది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదంపై ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (KRMB) లేఖ రాసింది. ఈ లేఖలో ఏపీకి మూడు విడతల్లో నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నామని బోర్డు తెలిపింది. అక్టోబర్ కోసం అడిగిన 5 టీఎంసీల్లో ఇప్పటికే 5.01 టీఎంసీలు విడుదల చేసినట్లు లేఖలో పేర్కొంది. 2024 జనవరి, ఏప్రిల్‌లో నీరు విడుదల చేయాల్సి ఉందని, 5 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేయడం సరికాదని కృష్ణా బోర్డు తెలిపింది.
డ్యాం దగ్గర ఏపీ పోలీసులను మోహరించి సాగర్‌ను ఆక్రమించారని కృష్ణా బోర్డుకు తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు.నవంబర్ 30వ తేదీ తర్వాత నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి అందలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శికి కృష్ణా బోర్డు లేఖ రాసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాల్వకు తక్షణమే నీటి విడుదల ఆపివేయాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 15 టీఎంసీల నీటిని విడుదలకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిందని పేర్కొంది.
2024 జనవరి 8 నుంచి 18 వరకు 5 టీఎంసీలు, ఏప్రిల్ 8 నుంచి 24 వరకు 5 టీఎంసీలు, అక్టోబర్ 10 నుంచి 20 వరకు 5 టీఎంసీలు నీరు విడుదలకు బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయని, నవంబర్ 30 వరకు ముందు అడగకుండా ఎలా నీటిని విడుదల చేస్తారని ఏపీని కేఆర్ఎంబీ ప్రశ్నించింది.
ఇదిలా ఉంటే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) డ్యామ్ వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్‌పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏపీ వైపు భారీగా పోలీసులు మోహరించారు. ఆ రాష్ట్రానికి చెందిన సుమారు 1200 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. కృష్ణా బోర్డు అధికారులు సాగర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఏపీ పోలీసులపై కేసు నమోదు
ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీ పోలీసులు అనుమతి లేకుండా నాగార్జునసాగర్ డ్యామ్‌పైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారని తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు నాగార్జునసాగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో అధికారులు తెలిపారు. దీంతో ఏపీ పోలీసులపై కేసు నమోదు చేశారు.
నాగార్జున సాగర్ విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏపీ పోలీసులపై ఈ కేసు నమోదు చేశారు. A-1గా ఏపీ పోలీస్ ఫోర్స్‌ను పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకువచ్చారని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఫిర్యాదు చేసింది. 500 మంది సాయుధ బలగాలతో.. సాగర్ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులు వచ్చారని ఫిర్యాదులో తెలిపారు.
ప్రధాన డ్యామ్‌లోని 13 నుంచి 26 గేట్ల వరకూ ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారని చెప్పారు. కుడికాలువ 5వ గేటు నుంచి కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీళ్లు వదిలారని ఫిర్యాదులో వెల్లడించారు. 447, 427 సెక్షన్ల కింద తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
జలాల వివాదానికి కారణం
ఉమ్మడి ఏపీ విభజన సమయంలో కృష్ణా, గోదావరి నదీ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలనే నిర్ణయం వెలువడింది. అయితే ఈ నిర్ణయం సరిగా అమలు కాలేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్తు కేంద్రం, తదితరాలను తెలంగాణ రాష్ట్రమే నిర్వహించుకుంటోంది. అటువైపు ఆంధ్రప్రదేశ్ అధికారులను రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్నాయి.కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు కూడా తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. కాగా ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ డిమాండు చేస్తోంది.