Hyd, Nov 30: గత అర్ధరాత్రి దాటిన తర్వాత నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగార్జునసాగర్ డ్యామ్‌పై తమ పరిధిలో ఫెన్సింగ్ వేసుకోవడానికి ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహకారం కోరారు. వారికి సెక్యూరిటీ కల్పించడానికి సాగర్ డ్యామ్‌పై వెళ్లడానికి ఏపీ పోలీసులు ప్రయత్నించారు.సాగర్ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులను, ఏపీ ఇరిగేషన్ అధికారులను వెళ్లకుండా తెలంగాణ పోలీసులు గేటు వేసి అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న గేటుకు సంబంధించిన సెన్సార్‌ను తెలంగాణ పోలీసులు పగలగొట్టారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారికి సెక్యూరిటీ కల్పించారు. పోలీసుల సహకారంతో సాగర్ డ్యామ్‌పై ఏపీ సరిహద్దుల్లో తమ పరిధిలో ఇరిగేషన్ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్ వరకు తమ పరిధిలోకి వస్తుందని చెబుతూ 500 మంది పోలీసులతో కలిసి వచ్చిన ఆ శాఖ ఉన్నతాధికారులు తమను అడ్డుకున్న డ్యామ్ సిబ్బందిపై దాడి జరిగినట్లు సమాచారం. వారి మొబైల్ ఫోన్లతోపాటు అక్కడి సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అనంతరం 13వ గేట్ వరకు ముళ్లకంచె ఏర్పాటు చేసి డ్యామ్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు.
సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్ వద్దకు చేరుకుని ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్ నిర్వహణ విషయం నీటిపారుదల అధికారులకు సంబంధించిన విషయమని, ముళ్లకంచెను తీసేయాలని సూచించారు. అయితే, వారు స్పందించకపోవడంతో చేసేది లేక వెనక్కి వెళ్లిపోయారు. రాష్ట్ర విభజన సమయంలో నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది.
నాగార్జున సాగర్ గొడవపై రాజకీయ నేతలకు తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ కీలక సూచన చేశారు. ఈ గొడవ విషయం పోలీసులకు వదిలివేయాలని, వాళ్లే చూసుకుంటారని చెప్పారు. ఏ పార్టీకి చెందిన నేతలైనా సరే దీనిపై ఎవరూ ఏమీ మాట్లాడవద్దని హెచ్చరించారు. కాగా, నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచి టెన్షన్ నెలకొంది. దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్ పైకి చేరుకుని 13వ నెంబర్ గేట్ వద్ద ముళ్ల కంచె ఏర్పాటు చేశారు.
అక్కడి వరకు తమ పరిధిలోకి వస్తుందంటూ డ్యామ్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. అక్కడున్న సీసీ కెమెరాలతో పాటు డ్యామ్ సెక్యూరిటీ సిబ్బంది ఫోన్లను ధ్వంసం చేశారు. విషయం తెలిసి మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏపీ పోలీసులతో మాట్లాడారు. ముళ్ల కంచెను తీసేయాలని చెప్పినా ఏపీ పోలీసులు వినిపించుకోలేదు. దీంతో తన సిబ్బందితో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది.
సాగర్ డ్యామ్‌పై పోలీసుల హడావుడి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. సాగర్ డ్యామ్‌పై పోలీసుల డ్రామా కేసీఆర్ పనేనన్నారు. ఓడిపోతున్నారని కేసీఆర్‌కు అర్థమై తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులు లేని హడావుడి పోలింగ్ రోజే ఎందుకు అవుతోందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎన్నికల కోసం వాడుతున్నారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు.