Hyd, Nov 30: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల చిన్నచిన్న ఘర్షణలు తలెత్తినా పోలీసులు సర్దిచెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్ల రాక మొదలైంది. పది గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 11 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలను అరికట్టేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసులతో భద్రత ఏర్పాటు చేసింది. జనగామలో రైల్వే స్టేషన్ సమీపంలోని పోలింగ్ బూత్ వద్ద ఉదయం ఉద్రిక్తత నెలకొంది. అధికార బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలింగ్ బూత్ లో ఎక్కువసేపు ఉండడంపై కాంగ్రెస్ లోకల్ లీడర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇది కాస్తా తోపులాటకు దారితీయడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఓటు హక్కును వినియోగించుకున్న AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, ఆయన భార్య ప్రణతి, తల్లి షాలిని, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ జూబ్లీహిల్స్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు భార్య సురేఖ, కుమార్తె శ్రీజతో కలిసి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి క్యూలో నిల్చున్నారు. జూబ్లీహిల్స్‌లోనే ఎమ్మల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్సార్‌నగర్‌లోని నారాయణ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 188లో రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు.
హైదరాబాద్ లోని నందినగర్ లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... ఒక బాధ్యత గల పౌరుడిగా తాను ఓటు హక్కును వినియోగించుకుని తన బాధ్యతను నిర్వహించానని చెప్పారు. అభివృద్ధి కోసం పాటు పడే పార్టీకి, ఒక మంచి నాయకుడికి ఓటు వేశానని చెప్పారు. అందరూ కూడా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఓటు వేయడానికి బయటకు రావాలని కోరారు.
బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఓటేయాలని కవిత పిలుపునిచ్చారు. పట్టణాల్లో ఓటింగ్ తక్కువ అన్న చెడ్డపేరు ఉందని అన్నారు. కాబట్టి.. నగరాలు, పట్టణాల్లోని వారు, యువత పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు.