Kakinada, JAN 15: ఆంధ్రప్రదేశ్ లో ఎంతో సంబరంగా జరుపుకునే సంక్రాంతి కోడి పందేల (cockfight) ఆటలో విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు ఘటనల్లో కోడి కత్తి తగిలి ఇద్దరు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల (Nallajerla) మండలం అనంతపల్లిలో శనివారం నుంచి కోడి పందేల (cockfight) పోటీలు జరుగుతున్నాయి. వీటిని తిలకించేందుకు గ్రామం నుంచే కాకుండా పొరుగున ఉన్న గ్రామస్థులు సైతం పెద్ద సంఖ్యలో అనంతపల్లికి చేరుకున్నారు. ఎంతో ఉల్లాసంగా జరుగుతున్న పోటీల్లో ఉన్న ఓ కోడి జనం మధ్యలోకి రావడంతో కోడికత్తి గుచ్చుకుని పద్మరాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు స్థానికులు అతడిని నల్లజర్ల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా రెండు రోజులుగా ఆయా జిల్లాలో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, నంద్యాల, కృష్ణా , తదితర జిల్లాలో కోట్లాది రూపాయలు పందేల్లో చేతులు మారుతున్నాయి. అటు కిర్లంపూడి మండలం వేలంకలో గుండే సురేష్ అనే మరో వ్యక్తి కూడా కోడి కత్తి తగిలి మరణించాడు. కోడి కాలికి కత్తి కడుతుండగా గుచ్చుకొని సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర రక్తస్రావం అవ్వడంతో అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు.