Amaravati, Jan 10: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిసిన సంగతి విదితమే. ఈ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారమే సినిమా టికెట్ ధరలు ఉన్నాయని రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని (Minister Perni Nani) అన్నారు. ఆర్జీవీ తాను చెప్పాల్సింది చెప్పారన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు చట్ట ప్రకారమే జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టే ప్రభుత్వం మాది కాదని.. నిబంధనలు అందరికీ ఒక్కటేనని పేర్ని నాని స్పష్టం చేశారు.
ఇప్పటికే సినిమా టికెట్ అంశానికి సంబంధించి కమిటీ ఏర్పాటైందన్నారు. కమిటీ సూచనల ప్రకారం తదుపరి నిర్ణయాలు ఉంటాయి. ఆర్జీవీ చెప్పిన అంశాలను ఉన్నత స్థాయి కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా సినిమా థియేటర్లకు 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తున్నామని.. అందరూ సహకరించాలని మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. వర్మ (Ram gopal Varma)మాట్లాడుతూ.. ‘మంత్రి పేర్ని నానితో సమావేశం సంతృప్తి నిచ్చింది. ఆయనతో మాట్లాడాక నేను కూడా 100 శాతం సంతృప్తి చెందాను. టికెట్ల విషయంలో నా ఆలోచనలను మంత్రికి వివరించా. ప్రభుత్వ ఆలోచనలను మంత్రి కూడా నాకు వివరించారు. నేను కేవలం నా ఆలోచనలను మాత్రమే చెప్పడానికి వచ్చాను. వీటిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.