అనంతపురం: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ అకాడమీ పనులకు మంత్రి సీతారామన్ భూమి పూజ చేయనున్నారు. నాసిన్ సంస్థ ఇక్కడ అకాడమీ ఏర్పాటు చేయనుంది. నిర్మలా సీతారామన్ తో పాటు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి కూడా పాల్గొంటారు.
కేంద్రమంత్రులు అనంతపురం జిల్లాకు వస్తుండటంతో పోలీసులు పెద్దయెత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. నాసిక్ సంస్థ ఏర్పాటుతో భూములు కోల్పోయిన రైతులు ఆందోళనకు దిగే అవకాశముందని తెలియడంతో పోలీసులు కొందరిని ముందస్తు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే పాలసముద్రం సమీపంలో 500.35 ఎకరాల్లో సుమారు రూ.700 కోట్లతో నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్) సంస్థ అకాడమీని నిర్మించనున్నారు. దక్షిణాదిలో రెండో అతిపెద్ద శిక్షణ కేంద్రం ఇదే కావడం గమనార్హం. ఐఆర్‌ఎస్‌లకు (ఇండియన రెవెన్యూ సర్వీసెస్) ప్రొబెషనరీలో భాగంగా ఇక్కడ శిక్షణ నిర్వహించనున్నారు. పరోక్ష పన్నుల అంశంపై అభ్యర్థుల సామర్థ్యాన్ని పెంచేలా శిక్షణనివ్వనున్నారు.
నాసిన్.. ఆర్థిక మంత్రిత్వ శాఖ, రెవెన్యూ డిపార్ట్‌మెంట్, పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు పరిధిలో పనిచేస్తుంది. దీన్ని గతంలో నాసన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్)గా పిలిచేవారు. తర్వాత నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌గా పేరు మార్చారు. ఇక్కడ యూపీఎస్సీ ద్వారా ఎంపికైన ఐఆర్‌ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్) అభ్యర్థులకు ప్రొబేషనరీ కాలంలో ప్రత్యేక శిక్షణ అందిస్తారు.