Tirupati, Dec 22: ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఒమిక్రాన్ మహమ్మారి తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావాన్ని చూపుతోంది. తెలంగాణలో ఇప్పటికే 20 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో తాజాగా రెండో ఒమిక్రాన్ కేసు (Omicron in Andhra Pradesh) నిర్ధారణ అయింది. కెన్యా నుంచి వచ్చిన 39 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా తేలింది. ఈమె కెన్యా నుంచి చెన్నైకు, అక్కడి నుంచి తిరుపతికి (Tirupati) చేరుకున్నారు. డిసెంబర్ 12న ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది.
ఆమె శాంపిల్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించగా... ఈరోజు ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఆమె కుటుంబ సభ్యులకు నెగెటివ్ వచ్చింది. ఆమెకు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో.. ఆమెకు కాంటాక్ట్ లోకి వచ్చిన వారికి పరీక్షలను నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు విజయనగరం జిల్లాలో నమోదైన సంగతి తెలిసిందే.
ఏపీలో గడచిన 24 గంటల్లో 27,233 కరోనా శాంపిల్స్ పరీక్షించగా 95 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 26 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 179 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,974 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,60,061 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,432 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,481కి పెరిగింది.