Vijayawada, May 21: ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో వర్షం (Heavy rains) కురిసింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడింది. మాడు పగిలే ఎండలతో విలవిలలాడిన ప్రజలు వర్షం కురవడంతో కాస్త రిలాక్స్ అయ్యారు. వాతావరణం చల్లబడటంతో సేదతీరారు. కడప జిల్లాలో (Heavy Rain In Kadapa) ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఎండ, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. పులివెందులలో భారీ వర్షం పడింది.
పులివెందులలోని మెయిన్ బజార్ వద్ద కొన్ని దుకాణాల్లోకి వర్షం నీరు ప్రవహించింది. దీంతో వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. సరుకు తడిసిపోవడంతో లబోదిబోమంటున్నారు. కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురంలో ఈదురు గాలి బీభత్సం సృష్టించింది. గాలి బీభత్సంతో ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న రేకుల షెడ్డు పైకప్పు గాలిలోకి ఎగిరి 33 కెవి విద్యుత్ తీగలపై పడడంతో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వర్షం పడటంతో రేకుల కింద తలదాచుకున్న వ్యక్తి మీద రేకులు పడ్డాయి. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బేతాయపల్లి గ్రామానికి చెందిన చిన్న సుబ్బయ్య (55)గా గుర్తించారు.