Vijayawada, Dec 2: వరికోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో వాతావరణశాఖ (IMD) చేసిన తాజా ప్రకటన కోస్తా, రాయలసీమ రైతులను (Farmers in Worry mood) కలవరానికి గురి చేస్తున్నది. కోస్తా, రాయలసీమల్లో 8,9వ తేదీల్లో వర్షాలు (Rains) పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడమే ఇందుకు కారణం. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 5న దక్షిణ అండమాన్ సముద్రం (South Andaman Sea), ఆగ్నేయ బంగాళాఖాతంలో (Bay of Bengal) అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి 7వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుందని తాజాగా వాతావరణశాఖ తెలిపింది. ఆ తర్వాతి రోజున అది పుదుచ్చేరి, తమిళనాడు తీరం దిశగా ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో 8,9వ తేదీల్లో వర్షాలు పడతాయని తెలిపింది.
ఐసీఎస్ఈ 10, ఐఎస్‌సీ 12 తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. పరీక్షల తేదీలివే!
వాతావరణశాఖ ప్రకటనతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు జోరుగా వరికోతలు సాగుతున్న నేపథ్యంలో వర్షం కనుక పడితే పంట వర్షార్పణం అయిపోతుంది. దీంతో వర్ష సమాచారం కోసం రైతులు విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రానికి ఫోన్లు చేసి వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకుంటారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. 5న అల్పపీడనం ఏర్పడిన తర్వాత కానీ వర్షాలకు సంబంధించిన సమాచారంపై స్పష్టత రాదని పేర్కొన్నారు. తూర్పు గాలుల ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
కాగా, మూడు నెలల కాలానికి గాను భారత వాతావరణ శాఖ నిన్న విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఏపీలో ఈ నెల నుంచి ఫిబ్రవరి వరకు చలి తీవ్రంగా ఉంటుంది. ఏపీ, తెలంగాణ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయి.