Nellore, May 31: కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి చెందారు. వారం రోజుల నుంచి నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన (Retired Headmaster Kotayya Dies) మరణించారు. కోట మండలం తిన్నెలపొడికి చెందిన కోటయ్య.. ఆనందయ్య మందుతో (Anandaiah's Ayurvedic Treatment) కోలుకున్నానన్న వీడియోతో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కంట్లో చుక్కలు వేసుకున్న వారం రోజులకు కోటయ్య ఆరోగ్యం క్షీణించగా, కోట ప్రభుత్వాసుపత్రిలో ఆయన చేరారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం 22న నెల్లూరు జీజీహెచ్‌కి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కోటయ్య మృతి చెందారు.
కాగా ఆనందయ్య మందు (Bonige Anandayya Anti-corona Medicine) తీసుకున్న అనంతరం ఆక్సిజన్ లెవల్స్ పెరగడంతో కుదుటపడ్డారు. అనంతరం ఆయన ఆరోగ్యం తిరిగి విషమించడంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోటయ్య నేడు తుదిశ్వాస విడిచారు. అప్పట్లో దాదాపు మరణం అంచులకు వెళ్లి ఆనందయ్య మందుతో తిరిగి వచ్చానని కోటయ్య చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ‘‘ఊపిరి అందడంలేదు. కొన ఊపిరితో ఉన్న.. ఇంకా రెండు నిముషాలు ఆగితే, ఆక్సిజన్ లేకపోతే చనిపోతా.. దీంతో వెంటనే మావాళ్లు వచ్చి వెంటనే కంటిలో మందు వేశారు. 10, 15 నిముషాల్లో కోలుకున్నానని, ఈ మందు చాలా అద్భుతం’’ అని గతంలో కోటయ్య తెలిపారు.
ఆనందయ్య తయారు చేసే మందు కోవిడ్ కోసం ఉపయోగిస్తానన్న దరఖాస్తు ఎక్కడా లేదని, సుమోటుగా ఈ మందు కోవిడ్‌కు పనికొస్తుందా? లేదా? అన్నది పరిశోధన చేసే అవకాశం ఇప్పట్లో లేదని ఆయూష్ కమిషనర్ వి. రాములు స్పష్టం చేశారు. ఆయన ఈ మందును వివిధ సమస్యల కోసం గత 30 ఏళ్లుగా ఉపయోగిస్తున్నారన్నారు. ఆ అనుభవాన్ని ఉపయోగించి ఇదే మందు కోవిడ్ పేషెంట్లకు కూడా ఇస్తున్నారన్నారు. ఇది కోవిడ్ మందుగా గుర్తించమని ఆనందయ్య దరఖాస్తు పెట్టుకుంటే అప్పుడు విచారించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయూష్ కమిషనర్ రాములు అన్నారు.
అన్నీ అనుకూలిస్తే ఆనందయ్య కరోనా మందు టీటీడీ ఉత్పత్తి చేసే అవకాశం
ఆయుర్వేద వైద్య నిపుణుడు ఆనందయ్య మందుపై అధ్యయనం పూర్తి అయ్యింది. ఈరోజు పూర్తి నివేదికను సీఎం జగన్‌కు ఆయుష్ కమిషనర్ రాములు అందించనున్నారు. నేడు కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎలాంటి దుష్ప్రభావాలు లేకపోతే ఆనందయ్య ముందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఆయుర్వేద వైద్య నిపుణుడు బొనిగి ఆనందయ్య ఇంకా కృష్ణపట్నం గోపాలపురంలోని కేపీఎస్ఎస్పీఎల్ అకాడమీలోనే ఉన్నారు. ఆనందయ్య చుట్టూ పోలీసు వలయం ఉంది. మరోవైపు హైకోర్టులో ఆనందయ్య మందు పంపిణీపై విచారణ కొనసాగనుంది.