Nellore, Sep 13: నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాళెంలో రౌడీ షీటర్ అశోక్ దారుణ హత్యకు (Nellore Shocker) గురయ్యాడు. కుమారుడి ఆగడాలను భరించలేక తండ్రే హతమార్చాడు. గ్రామంలో అరాచకాలకు పాల్పడుతున్న అశోక్.. మద్యం మత్తులో నిత్యం తండ్రితో గొడవ పడేవాడు. తీరు మార్చుకోమని చెప్పిన తండ్రిపై నిన్న రాత్రి దాడి చేయడంతో.. విసిగిపోయిన తండ్రి పెంచలయ్య.. మమకారాన్ని చంపుకొని కర్రతో కసిగా తలపై కొట్టి.. కుమారుడిని (Rowdy sheeter killed by His Father) హతమార్చాడు. హత్యకు ఉపయోగించిన కర్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక అనంతపురం జిల్లా గుంతకల్ లో ఒంటరితనం భరించలేక ఆర్మీ డాక్టర్ ఆత్మహత్య (Army Doctor Suicide) చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పట్టణంలోని భాగ్యనగర్ గంట చర్చి ఏరియాకు చెందిన వెంకటస్వామి, నాగమణి దంపతుల కుమారుడు కార్తీక్ వర్ధన్ (33)కర్నూలు మెడికల్ కాలేజీలో 2011లో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. తదనంతరం ఆగ్రా మిలటరీ హాస్పిటల్‌లో వైద్యుడిగా ఉద్యోగం పొందాడు. తనతో పాటు ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఆదోనికి చెందిన డాక్టర్ అప్పియాను ప్రేమించి నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు.
ఈమె ప్రస్తుతం పుణేలోని నేవీలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా కార్తీక్‌వర్ధన్, అప్పియా ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఉన్నారు. వారం రోజుల క్రితం గుంతకల్లుకు వచ్చిన కార్తీక్ వర్ధన్ శనివారం రాత్రి వరకు తన కుటుంబ సభ్యులు, బంధువులతో సరదాగా గడిపాడు.
కాగా తానొకచోట, భార్య, తల్లిదండ్రులు మరోచోట ఉండటంతో మనస్తాపానికి గురైన కార్తీక్‌వర్దన్ ఆదివారం ఉదయం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ పద్మావతి తెలిపారు.