Amaravati, Feb 28: ఏపీలో త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్ఈసీ కీలక ఆదేశాలను జారీ చేసింది. రానున్న మున్సిపల్ ఎన్నికలను (Municipal Elections) దృష్టిలో పెట్టుకొని వార్డు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్‌ఈసీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (SEC Nimmagadda Ramesh Kumar) జిల్లా కలెక్టర్లకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గాని ఎన్నికల విధుల్లో వాలంటీర్లు ఉండకూడదు. ఫోటో ఓటరు స్లిప్పుల పంపిణీలో వాలంటీర్లు పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో తెలిపింది. ఎన్నికల సమయంలో వాలంటీర్ల పై నిఘా ఉంచడంతో పాటు... వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవాలి. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందనే ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్లను వినియోగిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద భావించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది.
ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనడంపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సీరియస్‌గా తీసుకున్నారు. రాజకీయ ప్రక్రియలో వార్డు వాలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనకూడదని రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థుల తరపున ఓటర్లను ప్రభావితం చేయకూడదని సూచించారు. ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు వర్తించవని బెదిరించకూడదని తెలిపారు. ఓటర్ స్లిప్పులను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దన్నారు.
వాలంటీర్ల కదలికను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్ల ఫోన్లను సేఫ్ కస్టడీలో పెట్టాలని సూచించారు. ఎన్నికలకు వాలంటీర్లను ఉపయోగించడం కోడ్ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. వాలంటీర్లు దైనందిన విధులు నిర్వహించడంలో అభ్యంతరం లేదన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులకు ఎస్‌ఈసీ సర్క్యూలర్ పంపారు.