Vangalapudi Anitha (photo-Video Grab)

Vjy, Nov 7: సోషల్ మీడియాలో పోస్ట్‌ల అంశం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు రేపుతోంది. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి అనిత.. గత వైకాపా పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కొందరు తనను లక్ష్యంగా చేసుకొని పోస్టులు పెడుతున్నారని గుర్తుచేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ఆ పోస్టులు చూసి బాధేసింది. కానీ నేను గట్టిదాన్ని. అందుకే చలించలేదు. బలహీన క్షణంలో కఠినమైన నిర్ణయం తీసుకోలేదు. లేదంటే ఆ పోస్టులను చూసి సూసైడ్ చేసుకునే పరిస్థితి. మానసికంగా బలహీనంగా ఉంటే అంతే సంగతులు. ఆత్మహత్య చేసుకునే వారు. పోస్టులు చేస్తోన్న వెదవలను ఊరికే వదిలే ప్రసక్తే లేదు. కొందరు సోషల్ మీడియాను అస్త్రంగా వాడుతున్నారు. ఉగ్రవాదుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని ఊరికే వదిలే ప్రసక్తే లేదు. చట్టం ముందు నిలబెడతాం. శిక్ష పడే వరకు వదిలబోం అని’ హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.

అధికారంలోకి వచ్చాక ఏ పోలీసును వదలం, సప్త సముద్రాల అవతల ఉన్నా వెతికి మరీ పట్టుకుంటాం, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

గత ఐదేళ్ల విధ్వంస పాలనలో జగన్‌ (YS jagan) రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఏపీ హోంశాఖ మంత్రి అనిత (Vangalapudi Anitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం పరువు తీసే విధంగా పాలన సాగించారని మండిపడ్డారు. రాజకీయ ముసుగులో వైసీపీ నేతలు అనేక దారుణాలు చేశారన్నారు. ఈ 5 నెలల కాలంలో ఏవేవో జరిగిపోయాయంటూ జగన్‌ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

శాంతి భద్రతలు, ప్రజాస్వామ్యం గురించి జగన్‌ మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారనే దానిపై జగన్‌ మాట్లాడాలని అనిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్ని నేరాలు జరిగినా జగన్‌ ఐదేళ్లపాటు మాట్లాడలేదు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగినా ఆయన పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. వైకాపా పాలనలో గంజాయి, డ్రగ్స్‌ విచ్చలవిడిగా పెరిగాయి. ఐదు నెలల్లో ఏదో జరిగిపోయిందంటూ అభాండాలు వేస్తున్నారు.

Home Minister Vangalapudi Anitha Press Meet 

మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని అనేకమందిపై కేసులు పెట్టారు. అమరావతి మహిళా రైతుల గురించి నీచంగా మాట్లాడారు. దుర్గమ్మ గుడికి వెళ్లకుండా ఎలా అడ్డుకున్నారో చూశాం. డీజీపీ ఆఫీసు పక్కనున్న తెదేపా కార్యాలయంపై దాడి చేశారు. జగన్‌ హయాంలో పరదాలు కట్టుకొని సమావేశాలు పెట్టుకున్నారు. పెన్నులు, నల్లబట్టలు వేసుకున్నా సభలకు రానీయలేదు.

క్రిమినల్‌కు కులం, మతం, ప్రాంతం, పార్టీ ముసుగు ఎందుకు? ఏం జరిగినా మా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. అత్యాచారాలు జరుగుతున్నాయని లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. చీకటి రోజులు అంటే జగన్‌ తెలుసుకోవాలి. వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డి (Varra Ravindra Reddy).. విజయమ్మ, షర్మిల, నాపై దారుణమైన పోస్టులు పెట్టాడు.

సొంత తల్లి, చెల్లిని వైసీపీ కార్యకర్తలే తిడుతుంటే జగన్‌కు పౌరుషం రాలేదా?తల్లి, చెల్లి గురించి ఎవరు అసభ్యంగా మాట్లాడారో మీకు తెలియదా? ఆ మాటలతో మీ రక్తం మరగలేదేమో.. మా రక్తం మరుగుతోంది. వైసీపీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. గౌతు శిరీష, చింతకాయల వినయ్‌, రంగనాయకమ్మను ఇబ్బందులకు గురి చేశారు. ఏమైనా మాట్లాడితే భావ ప్రకటనా స్వేచ్ఛ అంటున్నారు. కొన్ని పోస్టుల గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది. ఇలాంటివి సహించాలంటారా?పోస్టులు పెట్టిన వారిని వదిలేయమంటారా అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటే.. చేయండి.. మేం ఎదుర్కొంటాం.. బాధ్యతగా సమాధానం ఇస్తాం. అంతే కానీ అసభ్యంగా పోస్టులు పెట్టే వారిని, క్రిమినల్స్‌ను వెనకేసుకు రావడమేంటి?మేమేదో వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నామంటూ మాట్లాడుతున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేసేవారికి బెయిల్‌ ఇప్పించేందుకు జగన్‌ వార్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంటే ఏమిటో జగన్‌కు తెలుసా? సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న వైసీపీ కార్యకర్తలను హెచ్చరిస్తున్నా. మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం’’ అని మంత్రి హెచ్చరించారు.